వాతావరణ శాఖ హైదరాబాద్ నగర వాసులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 26 నుంచి నగరంలో చలి తీవ్రత పెరుగుతుందని, పొగమంచు విపరీతంగా కురిసి ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితులు రాబోతున్నాయని హెచ్చిరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కనిష్టంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని, చిన్నపిల్లలు, వయోవృద్ధులు బయటికి రాకుండా ఉండడం మేలని తెలిపింది. నగరంలోని ఐదు జోన్లయిన శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, ఎల్బీనగర్, చార్మినార్, సికింద్రాబాద్ పరిధిలో పొగమంచు వల్ల వాహనాలు ప్రమాదానికి గురయ్యే అవకాశముందని వెల్లడించింది. ఉదయం బయటికి వెళ్లేటప్పుడు చలి నుంచి రక్షించే దుస్తులు ధరించమని జాగ్రత్తలు చెప్పింది.