జనవరి 3న మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో ప్రారంభం! - MicTv.in - Telugu News
mictv telugu

జనవరి 3న మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో ప్రారంభం!

August 9, 2017

హైదరాబాద్: నగర వాసుల కల ఫలించబోతోంది. హైదరాబాద్ మెట్రో రైలు పరుగుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి కూతకు రెడీ అవుతోంది. తొలుత రెండు కారిడార్లలో ప్రారంభం కానున్న మెట్రో సేవలను క్రమంగా విస్తరించనున్నారు. జనవరి 3న ప్రధాని నరేంద్ర మోడీ మెట్రో రైలును ప్రారంభించనున్నట్లు తెలిసింది. నాగోల్-బేగంపేట, మియాపూర్-అమీర్‌పేట కారిడార్లలో తొలుత మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

పగలూ రాత్రి పనుల వేగం…

ఈ నేపథ్యంలోనే అమీర్‌పేటలో, సికింద్రాబాద్‌ ఒలిఫెంటా వంతెన వద్ద ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపేసి పగలూరాత్రి పనులు నిర్వహిస్తున్నారు. రాజధాని నగరంలో 72 కి.మీ. పొడవున మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని కొన్నేళ్ల కిందట ప్రభుత్వం తలపెట్టింది.

వివిధ కారణాల వల్ల పాతబస్తీలో పనులు మొదలుకాలేదు. ప్రస్తుతం 66 కి.మీ. మేర పనులు జరుగుతున్నాయి. ఏడాది క్రితమే నాగోలు నుంచి మెట్టుగూడ వరకు 8 కి.మీ. నిర్మాణం పనులు పూర్తయ్యాయి. భద్రతా తనిఖీలనూ పూర్తి చేశారు. ఈ మొత్తం దూరంలో ఏడు రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

ఒలిఫెంటా వంతెనే కీలకం

మియాపూర్‌ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ వరకు 12 కి.మీ. మేర పనులు కూడా ఎనిమిది నెలల క్రితమే పూర్తయ్యాయి. దీని పరిధిలో 10 స్టేషన్లు ఉన్నాయి. పూర్తిస్థాయి అనుసంధానత లేకపోడం వల్ల ఈ రెండు కారిడార్లలో మెట్రో రైలు సేవలను ప్రారంభించినా పెద్దగా ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతో ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత చూపలేదు. మెట్టుగూడ నుంచి బేగంపేట వరకు నిర్మాణం పనులు చాలా వరకు కొలిక్కి వచ్చాయి. ఒలిఫెంటా వంతెన వద్ద అతి పెద్ద ఉక్కు వంతెన ఏర్పాటైతేనే ఈ మార్గంలో బేగంపేట వరకు రైలు నడిపేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశం మేరకు గత రెండు రోజుల నుంచి ఈ వంతెన ఏర్పాటు పనులను ఎల్‌అండ్‌టీ అధికారులు మొదలుపెట్టారు. మంగళవారం నుంచి ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో వంతెనను ఏర్పాటు చేసి మిగిలిన పనులను నవంబర్‌ నెలాఖరుకల్లా పూర్తి చేయాలనీ, డిసెంబరు ఆఖరుకల్లా ప్రయోగ పరీక్ష పూర్తి చేయాలని అనుకుంటున్నారు. దీనివల్ల బేగంపేట వరకు రైలును నడిపేందుకు వీలవుతుంది.

రెండో దశ

కాగా, బేగంపేట నుంచి అమీర్‌పేట వరకు లైను నిర్మాణం వేగంగా జరుగుతోంది. రెండోదశ కింద బేగంపేట నుంచి అమీర్‌పేట వరకు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక మియాపూర్‌ నుంచి ఎస్‌ఆర్‌ నగర్‌ వరకు కాకుండా అమీర్‌పేట వరకు మెట్రో రైలు నడిపితే మేలని ప్రభుత్వం భావిస్తోంది. అమీర్‌పేట వద్ద మార్పిడి స్టేషన్‌ను నిర్మించాల్సి ఉంది. దీనికి కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీని నిర్మాణాన్ని కొనసాగిస్తునే అమీర్‌పేట వరకు రైలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమీర్‌పేట నుంచి నాంపల్లి వరకు కూడా దాదాపు పనులు చివరి దశకు వచ్చాయి. రెండోదశలో అమీర్‌పేట నుంచి నాంపల్లి వరకు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇమ్లిబన్‌ వద్ద మూసీనదిపై భారీ మార్పిడి స్టేషన్‌ నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయ్యేందుకు మరో ఏడెనిమిది నెలలు పట్టేలా ఉంది. ప్రస్తుతం మూడు కోచ్‌లతో ఉన్న 53 మెట్రో రైళ్లు నగరానికి చేరాయి.

మోడీ చేతుల మీదుగా..

ఈ క్రమంలో హైదరాబాద్‌లో 2018, జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జాతీయ సైన్సు కాంగ్రెస్‌ సదస్సు జరగనుంది. 3న సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. ప్రధాని కార్యక్రమం అధికారికంగా ఖరారు కాకపోయినా ఆయన హాజరవుతారనే ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యఅతిథిగా హాజరవ్వాలంటూ సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రధానమంత్రిని కోరగా, సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ మేరకు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ రెండు కారిడార్లలో మెట్రోనూ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన తెలుస్తోంది..