జీతాలు పెంచాలంటూ గత రెండు రోజులుగా ధర్నా చేస్తున్న హైదరాబాద్ మెట్రో సిబ్బంది ఎట్టకేలకు తమ ఆందోళన విరమించారు. వారి డిమాండ్ల పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు మొత్తానికి ఈరోజు విధులకు హాజరయ్యారు. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో టికెటింగ్ సిబ్బంది విధులకు హాజరయ్యారు. సిబ్బంది హాజరుతో మెట్రో కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి.
ఈ ఉదయం తమ డిమాండ్లపై కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ కియోలిస్ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో.. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దాదాపు 450 మందికి పైగా మెట్రో సిబ్బంది.. వేతనాలు పెంచాలని,మెట్రోలో ఉచితంగా యాక్సెస్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో మంగళవారం రోజున మెట్రో టికెటింగ్ సిబ్బంది ధర్నాకు దిగారు. వీరి ధర్నాతో దిగొచ్చిన కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ కియోలిస్ అధికారులు… జీతాలు పెంచేదిలేదని తేల్చి చెప్పారు. ఇక, ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు సమ్మెను విరమించుకున్నారు.
మొత్తానికి రెండ్రోజులుగా ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు ఇవాళ ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం మెట్రో రైళ్లన్న యథావిధిగా రాకపోకలు కొనసాగిస్తున్నాయి.