నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో సంస్థ రైలు సర్వీసుల్లో మార్పులు చేసింది. నుమాయిష్ జరిగే అన్ని రోజులు మెట్రో రైలు సేవలను రాత్రి మరో గంటపాటు పొడిగించింది. దీంతో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లను నడుపనున్నారు.
టర్మినల్ స్టేషన్లు అయిన ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం నుంచి సాధారణంగా రాత్రి 11 గంటలకే చివరి మెట్రో రైలు అందుబాటులో ఉంటుంది. తాజాగా నుమాయిష్ ముగిసే వరకు(ఫిబ్రవరి 15 వరకు) చివరి సర్వీసు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరుతుందని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మియాపూర్-ఎల్బీ నగర్ (రెడ్ లైన్), నాగోల్ నుంచి రాయదుర్గం (బ్లూ లైన్) కారిడార్లలో మాత్రమే పొడిగింపు ఉంటుందని తెలిపారు.
అంతేకాకుండా ఎగ్జిబిషన్ కి వచ్చే ప్రయాణికుల రద్దీ కారణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ నడిచినంత కాలం గాంధీభవన్ మెట్రో స్టేషన్లో ఉండే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పుడున్న 4 టిక్కెట్ కౌంటర్లను 6కు పెంచారు.