కరోనా సోకితే ఎక్కడ ప్రాణాలు పోతాయోనని, ప్రజలు భయం భయంగా బతికేస్తున్నారు. మహమ్మారి అంటుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాధికి తోడు ఆస్పత్రుల్లో లక్షల్లో అయ్యే ఫీజు కూడా ఇందుకు కారణం. అయితే కొంత మంది విద్యార్థులు మాత్రం కరోనాను పెట్టుబడిగా మార్చేశారు. ఏ మాత్రం భయం లేకుండా వ్యాధిని అంటించుకొని డబ్బులు పోగేసుకుంటున్నారు. ప్లాస్మా దానం పేరుతో వేలల్లో డబ్బులు తీసుకోవడం సంచలనంగా మారింది. తమ విద్యార్థులు ఇలాంటి పనులు చేయడం చూసి యూనివర్సిటీ అధికారులు విచారణకు ఆదేశించారు. అమెరికాలోని ఇదహోలో గల బ్రిఘం యంగ్ యూనివర్శిటీలో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది.
బ్రిఘం యంగ్ యూనివర్సిటీ విద్యార్థులు కావాలనే కరోనా వైరస్‌ను అంటించుకుంటున్నారని యాజమాన్యానికి తెలిసింది. వారు వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత తమ ప్లాస్మాను హాస్పిటళ్లకు అమ్ముకుంటున్నారని వెల్లడైంది. అలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేసింది. డబ్బులు కోసం ప్రాణాలను ప్రమాదంలోకి తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించింది. ఇలా చేయడం వారికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది.
ఇప్పటివరకు ఈ యూనివర్శిటీలో 119 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వారంతా కోలుకొని కొన్ని సంస్థల ద్వారా యాంటీబాడీ ప్లాస్మాలను సేకరించి అమ్ముకుంటున్నారు. ఒక్కో యూనిట్‌కు 100 నుంచి 200 డాలర్లు చొప్పున ఆయా సంస్థలు చెల్లిస్తున్నాయి. ఖర్చుల కోసం విద్యార్థులు ఇలా ప్రమాదకరమైన దారిని ఎంచుకున్నారు. యువతను కరోనా వైరస్ ఏమీ చేయదనే ప్రచారం కారణంగా ఇలా చేస్తున్నారని తెలింది. వెంటనే విచారణకు ఆదేశించారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో కొత్త రకం సమస్యలు కోరి తెచ్చుకున్నవారు అవుతారని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు ఇలా మూకుమ్మడిగా వైరస్‌ను అంటించుకోవడం పలువురిని కలవరపెడుతోంది.