బాలీవుడ్ నటి పూనం పాండేకు ముంబై పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆదివారం లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఈ చర్యలు చేపట్టారు. ఆమె ప్రయాణించిన బీఎండబ్ల్యూ కారును సీజ్ చేసినట్టు వెల్లడించారు.
పూనం పాండే మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో తన కారులో తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎటువంటి కారణం లేకుండా నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నట్టు గుర్తించారు. వెంటనే కారును సీజ్ చేసి సెక్షన్ 188, 269, 51 (బి) ల కింద కేసు నమోదుచేశారు. ఆమెతో పాటు శామ్ అహ్మద్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. పూనం పాండే.. నషా, ఆగయా హీరో, ద జర్నీ ఆఫ్ కర్మ సినిమాల్లో నటించారు. కానీ ఎక్కువ కాలం ఆమె నటిగా నిలదొక్కుకోలేకపోయింది. గతంలో హీరోయిన్ శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాలపై ఓ ఒప్పందం విషయంలో ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.