సీఆర్‌పీఎఫ్ బలగాల్లో కరోనా కలకలం.. మరో 135 జవాన్లకు..
కేంద్ర బలగాల్లో కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)లో ఇప్పటికే 47 మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు ట్రూపర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. మరో 22 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో ఉండే ఈ బెటాలియన్‌లో సుమారు వెయ్యి మంది జవాన్లు ఉంటారు. దీంతో బెటాలియన్ కార్యాలయాన్ని మూసివేసి, అందులోని వారందరినీ ఐసొలేషన్ సెంటర్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, గతవారం తొలిసారి సీఆర్‌పీఎఫ్‌కి చెందిన 55 ఏళ్ల ఓ అధికారి కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఏఎస్ఐ ర్యాంకు అధికారి హోదాలో ఉన్న ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో.. ఆయనను సఫ్దర్‌గంజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎంతో పటిష్టంగా ఉన్న సీఆర్‌పీఎఫ్ దళాల్లో తొలిమరణం సంభవించడం తీవ్ర కలకలం రేపింది. తాజాగా 135 మంది జవాన్లకు కరోనా సోకడంతో CRPF బలగాలు మరింత అప్రమత్తం అయ్యాయి.