గుజరాత్ పేలుడులో ఐదుగురి మృతి.. విషవాయువులతో భయాందోళనలు..
గుజరాత్‌లోని దహేజ్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా.. మరో 57మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని భారుచ్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. మరోవైపు పేలుడు అనంతరం పరిశ్రమ నుంచి విష వాయువులు వెలువడ్డాయి. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 10కి పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి.
పేలుడు తర్వాత ఫ్యాక్టరీ చుట్టుపక్కల పెద్ద ఎత్తున దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు అంచనా వేశారు. యశశ్వి ఆగ్రో-కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అక్కడ 15 రకాల రసాయనాలు ఉత్పత్తి అవుతాయని సమాచారం. కాగా, ఈ ఘటన విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనను గుర్తు చేసింది.