వందేళ్ల తర్వాత కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. ఇళ్లు నీట మునిగి ఎందరో నిరాశ్రయులయ్యారు. 30 మంది వరకు మృతిచెందినట్టు తెలుస్తోంది. బాధితులకు ప్రభుత్వం అన్నీ విధాలుగా అండగా ఉంటామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఎందరో విరాళాలు అందించి తమ పెద్దమనసును చాటుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మై హోమ్ సంస్థ రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. హైదరాబాద్ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మైహోమ్ సంస్థ భరోసా ఇచ్చింది.
కాగా, హైదరాబాద్ వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్ల విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే మేఘా కంపెనీ రూ.10 కోట్ల విరాళం ప్రకటించింది. మరోపక్క పలువురు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలను ప్రకటిస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబులు చెరో కోటి రూపాయల విరాళం ప్రకటించారు. నాగార్జున రూ.50 లక్షలు, ఎన్టీఆర్ రూ.50 లక్షలు ప్రకటించారు. విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, దర్శకుడు త్రివిక్రమ్ రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. అనిల్, హరీష్ శంకర్ చెరో రూ. 5లక్షల విరాళం ప్రకటించారు.