తెలంగాణ ప్రజలు మరో దిగ్గజ నాయకుడిని కోల్పోయారు. కార్మిక లోకంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, వారి ప్రయోజనాల కోసం జీవితాంతం పోరాడిన వీరుడు ఇక లేడు. తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న నాయిని నర్సింహారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. శ్వాసకోశ వ్యాధి కబళించింది. నాయిని నిమోనియాతో పోరాడుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై యావత్ తెలంగాణ సమాజం, కార్మికులు, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
నాయిని నర్సింహారెడ్డి నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరడుగొమ్ము గ్రామంలో 1944 మే 12న జన్మించారు. తండ్రి దేవయ్య రెడ్డి, తల్లి సుభద్రమ్మ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సమయంలో ఆయన తండ్రిని పోలీసులు కాల్చి చంపారు. తర్వాత నాయిని హైదరాబాద్ చేరుకుని గోల్కొండ హైస్కూల్లో హెచ్ఎస్సీ వరకు చదివారు. మేనమామ కూతురు అహల్యారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఆయనకు దేవేందర్ రెడ్డి, సమంత రెడ్డి సంతానం. అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. కూతురు సమంత న్యాయవాద వృత్తిలో ఉన్నారు.
నాయిని విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. లోక్ నాయక్ జైప్రకాశ్ నారాయణ్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై సోషలిస్ట్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున నేరడుగొమ్ము గ్రామ సర్పంచ్‌గా పోటీ చేశారు. 1961 డిసెంబర్లో హైదరాబాద్‌కు మకాం మార్చారు. ప్రతిష్టాత్మకమైన వీఎస్టీ, ఐడీఎల్, హెచ్ఎంటీ, గంగప్ప కేబుల్స్, మోడ్రన్ బేకరి వంటి కంపెనీల్లో కార్మిక ఉద్యమాలు నడిపారు. సికింద్రాబాద్ హాకర్స్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్లకు అధ్యక్షుడిగా కొనసాగారు. కార్మికులకు జీతాల పెంపు, కనీస సదుపాయాల కోసం యాజమాన్యాలతో గట్టిగా పోరాటాలు చేశారు. ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఉన్న సమయంలో నాయిని బుల్లెట్‌పై తిరిగేవారు. ఆ బండి శబ్దం తమకు పెద్ద అండ అని కార్మికులు చెప్పుకునేవారు. ఆయన 1972లో తన సైకిల్ అమ్మి బుల్లెట్ కొన్నారు. పంచె కట్టి, బుల్లెట్‌పై అసెంబ్లీకి కూడా వెళ్లేవారు.
నాయిని 1969 నాటి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలో 30 సార్లు జైలుకు వెళ్లారు. పోలీసు కాల్పులకు, అరెస్టులకు బెదరకుండా కార్మికులను కూడగట్టి ఉద్యమం నడిపించారు. 1975లో కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు నాయినిని కూడా అరెస్ట్ చేశారు. ఆయనను ముషీరాబాద్ జైల్లో 18 నెలల పాటు నిర్బంధించారు. ఎమర్జెన్సీ మొత్తం కాలం నాయిని జైల్లోనే గడిపారు.
ఎమర్జెన్సీ తర్వాత సోషలిస్టు పార్టీని వదిలేశారు. ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణకు మద్దతివ్వకపోవడంతో నాయిని కొత్తగా ఏర్పడిన జనతా పార్టీలో చేరారు. 1978 ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ గెలిచారు. అప్పటి కార్మిక మంత్రి అంజయ్యను మూడువేల ఓట్ల మెజారిటీతో ఓడించారు. అదే పార్టీ అభ్యర్థిగా మళ్లీ 1985లో విజయం సాధించి మరోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. జనతా పార్టీ జనతా దళ్‌గా మారాక నాయిని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జిగా పనిచేశారు. ఆయన మొదటినుంచి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేవారు. జనతాదళ్ పనితీరు నచ్చని నాయిని చంద్రబాబు పిలుపుతో 30వేల మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏ పార్టీలో ఉన్నా ఆయన కార్మికుల వైపు, ప్రజలవైపు నిలబడి పనిచేశారు. నాటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రేడ్ యూనియన్ల బిల్లుకు టీడీపీ మద్దతివ్వడంతో నాయిని ఆ పార్టీకి రాజీనామా చేశారు.
అదే సమయంలో టీడీపీ నుంచి బయటికి వచ్చిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రసాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. ఉద్యమం మళ్లీ పుంజుకుంది. కేసీఆర్ నాయినికి స్వయంగా ఫోన్ టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్.. నాయిని ముద్దుగా టైగర్ అని పిలిచేవారు.
2004లో రాష్ట్రంలో కాంగ్రెస్- టీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డాక నాయిని సాంకేతిక విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవుల కోసం గట్టిగా ఎప్పుడూ పోరాడలేదు. 2008లో టీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చినప్పుడు కొన్నిక్షణాల వ్యవధిలో నాయిని తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్అధికారంలోకి వచ్చాక నాయిని రాష్ట్ర తొలి హోమ్ మంత్రిగా పగ్గాలు అందుకున్నారు. నాయిని ప్రజల మనిషి..ఎవరికీ ఏ ఆపద వచ్చినా.. ఏ సమయంలోనైనా ఒక్క ఫోన్ చేస్తే చాలు ఆయన రెక్కలు కట్టుకుని వాలేవారు. ఎనీ టైం నర్సింహారెడ్డిగా ప్రజల అభిమానం సంపాదించుకున్న నాయిని లోటు తీరనిది.