Mic TV Exclusive Article on Bigg Boss Reality Show
mictv telugu

బిగ్‌బాస్ ఎలా మొదలైంది.. ఇండియాలో ఎలా, ఎప్పుడు వచ్చిందో తెలుసా?

September 6, 2022

తెలుగులో బిగ్ బాస్ ఆరవ షో ఆదివారం మొదలైంది. దీంతో అభిమానించే వారు, విమర్శించేవారు మళ్లీ తెరపైకి వచ్చేశారు. హౌస్‌లో ఎవరెవరు పాల్గొంటారనే ఆసక్తితో ముఖ్యంగా యువత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా, సీపీఐ నారాయణ వంటి వారు అది బ్రోతల్ హౌస్ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. అటు ఈ రియాల్టీ షో ప్రపంచ వ్యాప్తంగా 68 భాషల్లో 508 సీజన్లు పూర్తి చేసుకుంది. మనం బిగ్ బాస్ అని పిలుచుకునే ఈ షో అసలు పేరు బిగ్ బ్రదర్. మన దేశంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ షో ప్రసారమైంది. ఈ నేపథ్యంలో అసలు ఈ షో ఎక్కడ మొదలైంది? మన దేశానికి ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం.

బాహ్యప్రపంచానికి దూరంగా కొందరిని ఒకే ఇంట్లో ఉంచి వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది? వ్యక్తిగత జీవితంలో ఎలా వ్యవహరిస్తారు? వంటి కుతూహల అంశాలతో నెదర్లాండ్‌లో ఎండెమాల్ అనే టీవీ సంస్థ మొదటిసారిగా ఈ షో చేసింది. కొన్ని కారణాలతో ఏడాదికే ఆపేయగా, ఎంటీవీ ‘ది రియల్ వరల్డ్’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. తర్వాత 1984లో ఈ షో అమెరికాకు వెళ్లాక ‘బిగ్ బ్రదర్’ అనే పేరుతో పాపులరైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పేర్లు మారినా ఇప్పటికీ తన భాగస్వామ్యంతోనే ఎండెమాల్ ఈ షో నడుపుతోంది. మన వద్ద మాత్రం బాలీవుడ్ నటి శిల్పా శెట్టి వల్ల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. యూకేలో నిర్వహించిన సెలెబ్రిటీ బిగ్ బ్రదర్ – 2007లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోటి కంటెస్టెంట్ జేడీ గూడీ జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో యూకేతో పాటు భారత్‌లో తీవ్ర దుమారం రేగింది. ఈ సందర్భంగా అందరి దృష్టి ఈ షోపై పడింది.

శిల్పా శెట్టి హుందాగా వ్యవహరించి ప్రైజ్ మనీ లక్ష ఫౌండ్లు గెలుచుకోవడంతో భారతీయ మీడియా ఆమెను ఆకాశానికెత్తేసింది. అప్పుడే ఈ షో పట్ల మన వాళ్లకి ఆకర్షణ ఉందని నిర్వాహకులకు అర్ధమైంది. ఈ షో మన దేశంలో మొదటగా హిందీలో 2006 నవంబరులో ప్రారంభమై 2007 జనవరిలో ముగిసింది. అప్పటినుంచి పదిహేనేళ్లలో 14 సీజన్లు నడిచాయి. అక్టోబర్ 2న 15వ సీజన్ ప్రారంభం కాబోతోంది. హిందీలో విజయవంతమవుతున్న సమయంలో వరుసగా ఆరు ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ మొదలైంది. 2013 లో కిచ్చా సుదీప్ హోస్ట్ గా మొదలైన కన్నడ బిగ్ బాస్ 8 సీజన్లు పూర్తి చేసుకుంది. 2013, 2016 లలో మిథున చక్రవర్తి, జీత్ హోస్ట్ లుగా నడిచిన బెంగాలీ బిగ్ బాస్ కు స్పందన కరవై నిలిచిపోయింది. కమల్ హాసన్ హోస్ట్ గా తమిళ బిగ్ బాస్ 2021 అక్టోబర్ 3 నుంచి ఐదో సీజన్ నడిచింది. 2018 లో మహేశ్ మంజ్రేకర్ హోస్ట్ గా మొదలైన మరాఠీ బిగ్ బాస్ 2021 సెప్టెంబర్ 19 నుంచి నడిచింది. మలయాళంలో మోహన్ లాల్ హోస్ట్ గా ఇప్పటికి మూడు సీజన్లు పూర్తిచేసుకుంది. మూడో సీజన్ చెన్నై శివార్లలో ఆఖరి వారం షూటింగ్ జరుగుతూ ఉండగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ తమిళనాడు ప్రభుత్వం అడ్డుకోవటంతో అర్థాంతరంగా ముగిసింది. ప్రేక్షకుల వోట్ల ఆధారంగా ఆరు నెలల తరువాత విజేతను ప్రకటించాల్సి వచ్చింది.

ఇక హిందీ తరువాత అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్న బిగ్ బాస్ తెలుగులోనే నడిచింది. 2017 నాటి మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీయార్, రెండో సీజన్ కు నానీ హోస్ట్ లుగా ఉండగా మూడో ఎపిసోడ్ మొదలు ఇప్పటి ఆరో ఎపిసోడ్ దాకా నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ రూల్స్ కు భిన్నంగా ముమైత్ ఖాన్ షో మధ్యలోనే గ్యాప్ తీసుకొని డ్రగ్స్ కేసులో సిట్ ముందు హాజరు కావాల్సి వచ్చింది. అప్పట్లో ముంబయ్-పూణే మధ్య లోనావాలా లో బిగ్ బాస్ సెట్ ఉండగా అక్కణ్ణుంచి బిగ్ బాస్ షో ప్రతినిధులతో కలిసి హైదరాబాదు చేరుకున్న ముమైత్ విచారణ తరువాత మళ్ళీ వెనక్కి వెళ్ళి షోలో పాల్గొనటం తెలిసిందే. అలాంటి సందర్భం ఇంకెప్పుడూ రాలేదు.

రాజకీయ వివాదాలు

బిగ్ బాస్ మీద రాజకీయ పార్టీల విమర్శలు కూడా చాలా ఉన్నాయి. 2019 లో బిజెపి ఎమ్మెల్యే నందకిశోర్ ఈ షో పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరెవరు ఎవరితో కలిసి పడకలు పంచుకోవాలో నిర్ణయించటం భారతీయ సంస్కృతికే కళంకమని విమర్శిస్తూ షో రద్దుచేయాలని అప్పటి సమాచార, ప్రసార శాఖామంత్రికి లేఖ రాశారు. 2010 లో హిందీ నాలుగో సీజన్ సమయంలో ఇద్దరు పాకిస్తానీ కంటెస్టెంట్స్ వీణా మాలిక్, బేగం నవాజిష్ అలీ ని అనుమతించటం మీద శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కలర్స్ ఛానల్ కార్యాలయానికి ర్యాలీ జరిపి నిరసన తెలియజేసింది. ఒకదశలో లోనావాలా లోని బిగ్ బాస్ సెట్ ను ముట్టడిస్తామని కూడా హెచ్చరించింది. నిరుడు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు పెను సంచాలనానికి దారితీశాయి. బిగ్ బాస్ ప్రోగ్రాం ఒక బ్రోతల్ షో అని, ఇదొక క్యాన్సర్ లాంటిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు దెబ్బతినేలా, పిల్లల బుర్ర పాడయ్యేలా ఈ షో ఉందని, నేరాలు పెరగడానికి ఇలాంటి షోలే కారణమవు తున్నాయని ఆరోపించారు. బయటికే అన్ని బూతులు కనిపిస్తుంటే, కనిపించకుండా ఇంకా ఏం జరుగుతోందో అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఆరో సీజన్ మొదలవగానే సీపీఐ నారాయణ మళ్ళీ అవే విమర్శలతో దాడికి దిగారు.