Mic TV Special story on Komatireddy venkata reddy Hung's comments
mictv telugu

కోమటిరెడ్డి ‘హంగ్’ వెనకాల ఇంత జరుగుతోందా!

February 14, 2023

 

Mic TV Special story on Komatireddy venkata reddy Hung's comments

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాదని హంగ్ రాబోతుందని ఆయన విశ్లేషించారు. దీన్ని ముందుగా గ్రహించిన కేసీఆర్.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారని, అందుకే కాంగ్రెస్ గురించి ఈ మధ్య పాజిటివ్‌గా స్పందిస్తున్నారని రచ్చ లేపారు. అంతేకాక, సొంత పార్టీ పరిస్థితిపై మాట్లాడుతూ అందరు నాయకులు కలిసి పని చేసినా 40 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలు కాబట్టి పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని క్యాడర్‌ని గందరగోళానికి గురి చేశారు. దీంతో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కొందరు నాయకులు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర స్పూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నియోజకవర్గ స్థాయిలో హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తుండగా, అక్కడి నుంచి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తున్నారు.

సీనియర్ల గరం

కోమటి రెడ్డి వ్యాఖ్యలు సొంత పార్టీలో కాక రేపుతున్నాయి. ఇన్నాళ్లూ గందరగోళానికి గురైన పార్టీ ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణిగి ప్రశాంతత ఏర్పడగా, ఇప్పుడు దాన్ని కోమటి రెడ్డి చెడగొట్టారని నేతలు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. సీనియర్ నేతలు హనుమంతరావు, జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్‌లు స్పందిస్తూ ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తే కార్యకర్తలు ధైర్యం కోల్పోతారని కొద్ది నెలల్లో ఎన్నికల రానున్నందున కీలక సమయంలో శ్రేణులను అయోమయానికి గురి చేయవద్దని హితవు పలికారు. తప్పులుంటే సరిదిద్దుకోవాలని ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని వాపోయారు.

జగ్గారెడ్డి మాత్రం అన్నీ తెలిసిన సీనియర్ నాయకుడే ఇలా మాట్లాడితే ఏం చేస్తామంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్ మాత్రం కాస్త ఘాటుగా స్పందించారు. కోమటిరెడ్డి ప్రతీసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసి పార్టీకి నష్టం కలిగిస్తున్నారని, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం అలవాటయిందన్నారు. అంతేకాక, మునుగోడు ఉప ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకొని ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. పొత్తులపై వరంగల్ సభలో రాహుల్ గాంధీ చెప్పిన మాటే ఫైనల్ అంటూ కోమటిరెడ్డిపై చర్యలకు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పని చేసిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు సరికావని, కార్యకర్తలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.

బీజేపీ కోవర్టు వ్యూహమా?


ఇది ఒక రకంగా నిజమేనేమో అనేలా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయమని చెప్పి విదేశాలకు చెక్కేసిన ఉదంతాన్ని ఉదాహరణగా చూస్తున్నారు. అయినా అప్పుడేదో తమ్ముడి కోసం ఆరాటపడ్డాడు సర్లే అని ఎలాంటి చర్యలు తీసుకోకుండా సరిపెట్టుకున్నా.. తాజా పరిణామాలు చూస్తుంటే ఎప్పుడో మర్చిపోయిన కోవర్టు వ్యవస్థకు తిరిగి కోమటిరెడ్డి ప్రాణం పోశారని భావిస్తున్నారు.

ఈ వ్యాఖ్యలు అంతిమంగా బీజేపీకే మేలు చేసేలా ఉన్నాయని, ఎన్నికలకు ముందే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అనే సందేశం ప్రజల్లో వెళ్లడానికి బీజేపీ కుట్రపూరితంగా కోమటిరెడ్డిని వాడుకుంటోందని చెప్పేవారు లేకపోలేదు. మరోవైపు సొంత పార్టీలో రేవంత్ పొడ గిట్టని కోమటిరెడ్డి.. త్వరలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి లేదా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బైక్ యాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. దీంతో రేవంత్ చేస్తున్న పాదయాత్ర ప్రభావం తగ్గించే ప్రయత్నం ఉందని ఆరోపిస్తున్నారు.

కల్వకుంట్ల కుటుంబానికి చెక్ పెట్టనున్నారా?

 

తెలంగాణ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కుటుంబం కీలక పాత్ర పోషిస్తోంది. బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రభుత్వంలోని కీలక పదవులన్నీ ఆ కుటుంబం చేతిలోనే ఉన్నాయని, రాష్ట్రంలోని ఏ నేత కూడా వారిని ఎదుర్కోలేరనే అభిప్రాయం ఉంది. దీనికి కోమటిరెడ్డి ద్వారా చెక్ పెట్టాలనే ఆలోచనకు బీజేపీ వచ్చినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన వెంటనే బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ ఒక్కటేనని వారిని ఎదుర్కొనే సత్తా కేవలం బీజేపీకే ఉందని చెప్పారు.

దీంతో ఎన్నికల వరకు పరిస్థితి చూసి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాదిరే అన్న వెంకట రెడ్డి కూడా బీజేపీలో చేరతారని, ఇదంతా అధిష్టానం ప్రణాళిక అని ఊహిస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో ఉంటే కల్వకుంట్ల ఫ్యామిలీని దీటుగా ఎదుర్కొంటారని, రాష్ట్రంలో మరే ఇతర నాయకుడి కుటుంబం ఆర్ధికంగా, సామాజికపరంగా, ఓట్ల పరంగా ఢీకొట్టే పరిస్థితి లేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.

కోమటిరెడ్డి వివరణ

తన మాటలు వైరల్ కావడంతో మంగళవారం సాయంత్రం వెంకట రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేని కలుసుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఆయనను కలిసి వివరణ ఇచ్చారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని, తానలా అనలేదని వివరించారు. తన మాటలు అర్ధం అయ్యేవాళ్లకు అర్ధం అవుతాయని, కాంగ్రెస్‌కి ఎవరితో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. దీన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని, బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని పేర్కొనడం కొసమెరుపు. అటు మాణిక్ రావు ఠాకూర్ స్పందిస్తూ.. కోమటిరెడ్డి ఏం మాట్లాడారో ఆ వీడియో నేను చూడలేదు. చూశాక స్పందిస్తా. పొత్తులపై వరంగల్‌లో రాహుల్ గాంధీ చెప్పిన మాటకు పార్టీ కట్టుబడి ఉంద’ని తేల్చి చెప్పారు.