ఫేక్‌గాడి ఆట కట్టించిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

ఫేక్‌గాడి ఆట కట్టించిన పోలీసులు

September 25, 2018

ఫేస్‌బుక్‌లో లెక్కకు మించిన ఫేక్ అకౌంట్లు వుంటున్నాయి. వాటిని నియంత్రిస్తామని ఫేస్‌బుక్ సీఈఓ ప్రకటించినప్పటికీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇంకే.. ఇదే అదునుగా భావించిన కొందరు ఫేక్‌గాళ్ళు చెలరేగిపోతున్నారు. సెలబ్రిటీల పేర్లు పెట్టుకుని అమ్మాయిలను ట్రాప్ చేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి సైబర్ నేరాలు జరిగినప్పుడు వాళ్ళను పట్టుకుని కటకటాల్లోకి నెట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి తప్పితే, అవి జరగకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదు ?

ఇది అలాంటి స్టోరీయే. ఫేస్‌బుక్‌లో నకిలీ పేరుతో అకౌంట్ ఓపన్ చేసి ఓ యువతిని ట్రాప్ చేశాడో ఫేక్‌గాడు. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగాడు. బాధిత యువతి పోలీసులను ఆశ్రయించగా అయ్యగారు పట్టుబడి కటకటాల పాలయ్యారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…2017లో జీలన్‌ నోయల్‌ పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతాను గమనించింది యువతి. అతను నిజంగానే సింగర్ అనుకుంది.  అతనికి మెసేజ్‌ చేసింది. అతను రిప్లైలో తాను నోయల్ కాదు అని నిజం చెప్పాడు. తాను అనంతపురానికి చెందిన జీలన్ బాషాగా చెప్పాడు. ఫ్రెండ్స్‌గా వుందామని నమ్మబలికాడు. తర్వాత ఇద్దరూ తరచూ మెసెంజర్లో చాటింగులు, ఫోన్ కాల్స్‌తో సరదా సరదాగా మాట్లాడుకున్నారు. కానీ అతను మాత్రం అదంతా సరదాగా తీసుకోలేదు. ఆమె చుట్టూ ఓ వలయాన్ని అల్లసాగాడు. ఆమెతో పలుసార్లు సెల్ఫీలు దిగాడు. ఆమె పర్సనల్‌ ఫోటోలు కూడా తీసుకున్నాడు.  ఈ క్రమంలో వారం క్రితం నుంచి సదరు యువతి అతనితో కాంటాక్ట్‌లో లేకుండా పోయింది.

దీంతో కోపం పెంచుకున్న జీలన్‌ అభ్యంతరకర సందేశాలు, నగ్నచిత్రాలు ఆమెకు వాట్సాప్‌ చేశాడు. తన ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోతే ఫొటోలను మార్ఫింగ్‌ చేసి నగ్నచిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బాధితురాలితో పాటు ఆమె భర్తను బెదిరించాడు. దీంతో బాధితురాలు తన భర్తతో కలిసి అతని ఆట కట్టించాలనుకుంది. వెంటనే రాచకొండ పోలీసులను ఆశ్రయించింది.

దీంతో అతని కథ అడ్డం తిరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జీలన్ బాషాను అనంతపురం జిల్లా, యెల్లనూర్‌లో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువచ్చారు. పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు బాషా. అతని దగ్గరనుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.