రాతలు రఫాడిస్తాయి మరి.... - MicTv.in - Telugu News
mictv telugu

రాతలు రఫాడిస్తాయి మరి….

October 10, 2018

మాటలు గాలికి పోతాయ్. అదే రాతలు లక్కు బాగా లేకపోతే రఫాడిస్తాయి.  ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. గతంలో  ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే కయ్యిమని లేచేవారు. ఆ పార్టీని లేకుండా చేయాలని అనేవారు. ప్రతీ సందర్భంలో  ఆ పార్టీ పై ఘాటు కామెంట్లు చేసేవారు. టిడిపి పుట్టిందే కాంగ్రెస్ పెత్తనపు రాజకీయాలకు వ్యతిరేకంగా… బాబుగారు పూర్వపు కాంగ్రెస్  నాయకుడే అయినా..పార్టీ మారారు కాబట్టి ఆ మాత్రం మాట్లాడొచ్చులే అని సర్దుకోవచ్చు.

కాకపోతే బాబు గారికి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నారు. ఏదో రకంగా ఆ పార్టీని వెనుకేసుకు రావాల్సి వస్తున్నది.  

ఇక్కడ టిఆర్ఎస్‌పై, కేంద్రంలో బిజెపి పైనా విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ విషయంలో కాస్త టోన్ తగ్గించి మాట్లాడుతున్నారు. మోడీ విషయంలో ఫైర్ అవుతున్నారు. ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు.Writes are playing Rough game .... కానీ ఆయన రాసిన  రాతలు, చేసిన ట్వీట్లు మాత్రం ఇప్పుడు ఇబ్బందికి గురి చేస్తున్నాయి. 2014లో కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని దేశంలోనే లేకుండా చేయాలని బాబు ట్వీట్ చేశారు. అప్పట్లో ఆయన ప్రజా గర్జన పేరుతో  సభలు నిర్వహించారు. ఆ సందర్భంగా ఈ తరహా కామెంట్లు పోస్టు చేశారు. వాటిని తీసుకుని కేటీఆర్ ఓ లెవల్లో కౌంటర్లు ఇచ్చారు.

ప్రస్తుతం టిడిపి  తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకుంటున్నది. బాబు చేసిన ట్వీట్లనే రీట్వీట్ చేస్తూ  బాబు గారు మీరు అప్పట్లో చెప్పిందే మేము అంటున్నదని చురకలంటించారు. అంతటితో ఆగలేదు. బాబు గారి మాటలను తీసుకుని వ్యంగ్యంగా  కామెంట్లు చేశారు.

తెలంగాణపై  సోనియా, రాహుల్ గాంధీలు కొత్తగా ప్రేమ ఒలకబోస్తున్నారని, ఇన్నాళ్లు ఏం చేశారని  బాబు అప్పట్లో ట్విటర్లో ప్రశ్నించారు. దీనిపై కూడా రామారావు రీట్వీట్ చేస్తూ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో వారు ఏమీ చేయనప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పు ఏమిటో అని వ్యంగ్యంగా రాశారు.

అన్నీ అభివృద్ధి చేసింది నేనే అని మాటల్లో చెప్పుకున్నట్లు కాదు బాబు గారు…. ట్వీట్లల్లో రీట్వీట్లూ ఉంటాయని రామారావు గారి కామెంట్లు స్పష్టం చేస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. కాంగ్రెస్‌కు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించే తెలుగుదేశం పార్టీ అవసరమో, అనివార్యమో దానితోనే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది.

కేంద్రంలో మోడీని ఢీకొనాలంటే తనకు తోచిన మార్గంలో వెళ్లాలి కాబట్టి రాజకీయంగా ఇలాంటి సమీకరణలు తప్పవని, తప్పూ కాదని కొందరు అంటున్నారు. అంతవరకు ఒకే.. కానీ  అవసరాన్ని బట్టి డైలాగులు మారిస్తే ఇబ్బందే కదా అని మరి కొందరు నెటిజన్లు అంటున్నారు.

చాలా రోజుల తర్వాత బాబు గారి గత మాటలకు  తాజా సమాధానాలు దొరికినట్లున్నాయి. పొత్తుల  విషయంలో ఎటూ తేలక తల పట్టుకుంటున్న కూటమి నాయకులకు గతం గుర్తుకు తెచ్చి మరింత ఇబ్బందులకు గురి చేసినట్లు అయిందని కొందరు అంటున్నారు.