టిక్‌టాక్ కొనేస్తామన్న మైక్రోసాఫ్ట్.. తొలగిన సస్పెన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్ కొనేస్తామన్న మైక్రోసాఫ్ట్.. తొలగిన సస్పెన్స్

August 3, 2020

Microsoft Ready To Buy TikTok

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ మైక్రోసాఫ్ట్ చేతిలోకి వెళ్లిపోతుందా లేదా అనే దానిపై సందిగ్ధత తొలగిపోయింది. సెప్టెంబర్ 15 లోపు చర్చల ప్రక్రియ పూర్తి చేసి దాన్ని కొనుగోలు చేస్తామని మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించింది. మైక్రో బ్లాగ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తొలిసారి అధికారికంగా ప్రకటించింది. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ కంపెనీతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని  తెలిపింది. ఈ కొనుగోలు వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం చెప్పారనే ప్రచారం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ పూర్తి వివరాలను వెల్లడించింది. 

సమాచార భద్రతకు ముప్పు లేకుండా టిక్ టాక్ కార్యకలాపాలను స్వాధీనం చేసుకుంటామని మైక్రో సాఫ్ట్ తెలిపింది. దీని ద్వారా అమెరికాకు ఆర్థిక లాభం చేకూరేలా చేస్తామని ప్రకటించింది. ట్రంప్‌తో తమ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల చర్చించిన తర్వాతే చర్చల ప్రక్రియ ప్రారంభమౌతుందని స్పష్టం చేసింది. అమెరికా పౌరుల డేటాకు విఘాతం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ఒకవేళ ఇప్పటికే సమాచారం ఇతర సర్వర్లలోకి వెళ్లి ఉంటే వాటిని శాశ్వతంగా తొలగిస్తామని చెప్పింది. కాగా ఇటీవల భారత్ టిక్‌టాక్‌ను నిషేధించడంతో అమెరికాలోనే అలాంటి చర్చ తెరపైకి వచ్చింది. అమెరికా పౌరుల సమాచారాన్ని చైనా ఇంటెలిజెన్స్ వినియోగించుకునే అవకాశం ఉన్నదని, అందుకే దాన్ని నిషేధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ దాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం విశేషం.