10 పర్సెంట్ ..50 పర్సెంట్..90 పర్సెంట్ క్యాష్ బ్యాక్ లు అంటూ కస్టమర్లని ఆకట్టుకోవడానికి ఈ కామర్స్ సైట్లు ప్రచారం చేస్తూ ఉంటాయి. ఆఫర్లు భళా అని వినియోగదారులు వస్తువులు కొంటుంటారు. తీరా క్యాష్ బ్యాక్ కు వచ్చేసారికి కంపెనీలు కహానీలు చెబుతుంటాయి. కొందరు కస్టమర్ కేర్ తో మాట్లాడి మాట్లాడి విసుగు వచ్చి వదిలేస్తారు..మరికొందరు మెయిల్స్ పెట్టి చేసేదేమి లేక ఊరుకుంటారు…కానీ అలా వదల బొమ్మాళి అంటూ ఆమెజాన్ పని పట్టాడో తెలంగాణ కుర్రాడు.
హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ కు చెందిన సుశాంత్ 2014 డిసెంబర్ 20న అమెజాన్ సైట్లో యాపిల్ ఐఫోన్ 5సీ కొన్నాడు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.6500 క్యాష్ బ్యాక్ వస్తుందని వెబ్సైట్లో పేర్కొనడంతో ఆ విషయాన్ని కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ధృవీకరించుకున్నాడు. ఆ తరువాత ఐఫోన్ కొన్నాడు. ఎన్ని రోజులు అయినా క్యాష్ బ్యాక్ రాలేదు. దీంతో సుశాంత్ మొదట జూన్ 7, 2015న అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ మండలిలో కంప్లయింట్ చేశాడు. కానీ అక్కడ సుశాంత్‌కు భంగపాటు తప్పలేదు.
అయినా వదల బొమ్మాళి అంటూ సుశాంత్ అమెజాన్ ఇండియా వెబ్సైట్ ఎండీని ప్రతివాదిగా పేర్కొంటూ అతను హైదరాబాద్ జిల్లా ఫోరాన్ని ఆశ్రయించాడు. ఇరు పక్షాల వాదనలను వింది. సైట్లో పెట్టిన ఆఫర్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని, అది వెబ్సైట్లో వస్తువులను విక్రయించే థర్డ్ పార్టీ వ్యక్తి పెట్టాడని అమెజాన్ వాదించింది. ఈ వాదనతో ఫోరం సంతృప్తి చెందలేదు. వెబ్సైట్లో ఏది పెట్టినా అందుకు సైట్ యాజమాన్యం బాధ్యత వహించాలని ఫోరం చెప్పింది. ఈ క్రమంలో బాధితుడు సుశాంత్‌కు రూ.15వేల నష్టపరిహారంతోపాటు ఖర్చుల నిమిత్తం రూ.5వేలను మొత్తం కలిపి రూ.20వేలను చెల్లించాలని ఆమెజాన్ ను ఆదేశించింది.
ఇలా ఎంతో మంది క్యాష్ బ్యాక్ ఆఫర్ల బాధితులు ఉన్నారు. ఆమెజాన్ ఒక్కటే కాదు..చాలా ఈ కామర్స్ కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి. బాధితులు కస్టమర్లతో మాట్లాడి ఫోన్ పొట్లాడి వదిలేస్తున్నారు. కానీ అలా వదలొద్దు…కోర్టులకు ఈడ్చాలని సుశాంత్ లాంటి వాళ్లు చెబుతున్నారు.