సినిమా‘కథలో రాజకుమారి’! - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా‘కథలో రాజకుమారి’!

September 15, 2017

సినిమా :  కథలో రాజకుమారి

ట్యాగ్ లైన్: లవ్ యిన్ ది బెస్ట్ ఫారమ్

లెంగ్త్ : 112 నిముషాల 41 సెకన్లు

సమర్పణ : శిరవూరి రాజేష్ వర్మ

బేనర్ : ఆరోహి సినిమా, అరణ్ మీడియా వర్క్స్, శ్రీహాస్ ఎంటర్టైన్మెంట్స్ & సుధాకర్ ఇంప్లెక్స్ ప్రై. లిమిటెడ్

రచనా సహకారం: రాజ్ కుమార్ వెలిశాల

స్క్రిప్ట్ సూపర్వైజింగ్ : పరుచూరి బ్రదర్స్

పాటలు : కెకె

సంగీతం : ఇళయారాజా, విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫి : నరేష్ కంచరాన

ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్

నిర్మాతలు : సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకరరెడ్డి, కృష్ణ విజయ

కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : మహేష్ సూరపనేని

నటులు : నారా రోహిత్, నమితా ప్రమోద్, నాగ శౌర్య, నందిత, అజయ్, ప్రభాస్ శీను, తనికెళ్ళ భరణి, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు

నారా రోహిత్ సినిమా అనగానే కాస్తంత కొత్తదనం, కొత్త ఆలోచనలకు అవకాశం వుంటుందని సగటు ప్రేక్షకుడి నమ్మకం. అందుకు తగ్గట్టుగానే సినిమా టైటిల్ కూడా ‘కథలో రాజకుమారి’ అని వుండడంతో ఆ వైపుగా ఆలోచిస్తూ సినిమాకు వెళితే మాత్రం ఆ నమ్మకం చెదిరిపోతుంది. కొత్తగా వున్నదల్లా ఆకట్టుకుంటుందని అనుకోవడానికి వీల్లేదనిపిస్తుంది! ఎందుకంటే ఆ కొత్తదనం కృత్రిమంగా వుండకూడదు కదా? ఏదైనా సహజంగా వున్నప్పుడే ప్రేక్షకుడు అందులో లీనమై తనని తాను చూసుకొని సినిమాని సక్సెస్ చేస్తారు!

చందమామ కథలో వున్నట్టే ఒక రాజకుమారి.. అదికూడా బాల్యంలో. చెప్పక్కర్లేదు.. రాజకుమారితో స్నేహం చేసినవాడు రాజకుమారుడు అవుతాడు. రాజకుమారి దుఃఖానికి కారణమైన వారిని పరిహారంగా రాజకుమారుడు దండిస్తాడు. అది కూడా రాజకుమారి కోసమే. ఆమె కోసమే- ఆమె చెప్పకుండానే- ఆపని చేస్తాడు. దాని ఫలితాలను మాత్రం తిరిగి రాజకుమారి మీదకు నెట్టేస్తాడు. పగపట్టేస్తాడు.. అది కూడా బుద్దీ జ్ఞానం వున్న వయసు వచ్చాక. అర్థం కాలేదా?, సరే కథలోకి వెళదాం..

అనగనగా ఒక పాప. మరొక బాబు. ఆడుకుంటారు. పాడుకుంటారు. టైటిల్స్ అయిపోతాయి. పోతూనే కత్తిపట్టుకు నరికేస్తాడు హీరో. కాదు, విలన్. సినిమా విలన్. అతడే అర్జున్ చక్రవర్తి (నారా రోహిత్). తను నటించాల్సింది పోయి జీవించేస్తూ వుంటాడు. కౄరత్వం మూర్ఖత్వం అతడి నైజం. ఆ రియాలిటీ వల్ల సినిమాల్లో బాగా రాణిస్తూ వచ్చిన ఏడేళ్ళలోనే యాభై సినిమాలు, మళ్ళీ మళ్ళీ అవార్డులు కొట్టుకుపోతుంటాడు. కాని అతనితో నటించడం కష్టమవుతుంటుంది. ఓ అమ్మాయి(నందిత) అతని యాటిట్యూడ్ బాలేదని నిందిస్తుంది. దాంతో తాగి బండి నడిపడంతో డ్రైవర్ కాలు పోతుంది. విలన్లో చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ ఎంతవరకంటే అతని నటనలో కూడా. విలన్ రాణించలేక సైక్రియాటిస్ట్ చెప్పిన విధంగా శత్రువుని గుర్తిస్తాడు. ఎవరంటే తన బాల్య మిత్రురాలు సీత (నమితా ప్రమోద్). తను చేసిన పని ఫలితాన్ని ఆమె మీదికి సులువుగా నెట్టి, ఇన్నేళ్ళ తరువాత ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె జీవితాన్ని నాశనం చెయ్యాలను కొని అసలు విలనుగా ఓడి నటనలో గెలిచి హీరో అవడమే కథ!

ఏ కథనయినా ఎంచకోవచ్చు. తప్పులేదు. కాని కన్వీన్సింగ్ గా వుండాలి కదా? అలా లేదు. తెలిసీ తెలియని వయసులో జరిగిన ఘటన పట్టుకొని హీరో విలన్లా వెళ్ళి హీరో కావడం కొత్త పాయింట్ అనుకొని వుండొచ్చు. కాని అమరిక బాగున్నంతగా అల్లిక బాలేదు. ఒక పెద్ద సినిమా విలన్ చిన్న బుల్లిపిచ్చుకపై తన శత్రుత్వం తీర్చుకోవడానికి వెళ్ళడం యెంతమాత్రం చందమామ కథ అనిపించుకోదు. అసలు కథే అనిపించుకోదు. అందువల్ల యిరవై నాలుగు ప్రయాసలు పనికిరాకుండాపోయాయి!

రోహిత్ నటన మామూలే. ఎప్పటిలాగే వుంది. నమితా ప్రమోద్ వోకే అనిపించుకుంది. ప్రభాస్ శీను అక్కడక్కడ నవ్వించాడు. ఇంటర్వెల్ తరువాత వచ్చే పాట బాగుంది. మేకింగ్ వైజ్ కూడా. సినిమాలో మెచ్చుకోతగ్గది యేమైనా వుందీ అంటే అది కెమెరా పనితనం. పాటలు విసిగించవు. ఇంతకు మించి చెప్పుకోవడానికి యేమీ లేదు.

ఆలోచనగా బాగున్నదల్లా కథగా రాణించదు. కథగా రాణించేదల్లా చందమామ కథ కాదు. కథలో రాజకుమారి వున్నా ఆమె రాజకుమారి కాదు! కార్య కారణ సంబంధాలు సరిగా (కాజ్ అండ్ ఎఫెక్ట్- ఎఫెక్టీవ్ గా) వున్నప్పుడే ఆలోచనలు మంచి కథలవుతాయి. ‘సినిమా కథ’లు అని అనిపించుకోకుండా వుంటాయి!

రేటింగ్: 1.75/5

-జాసి