మామిడి పండ్లు తింటున్నారా? అయితే ఇది మీ కోసమే! - MicTv.in - Telugu News
mictv telugu

మామిడి పండ్లు తింటున్నారా? అయితే ఇది మీ కోసమే!

May 8, 2019

మామిడిపండు అంటే ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి. నోరూరించే పండును చూడగానే లటుక్కున అందుకుని పసపసా తినేస్తాం. ఫలాల్లో రాజు అయిన ఈ పండు వేసవిలోనే విరివిగా లభిస్తుంది. పుల్లటి కాయలను ఊరగాయలు పెట్టుకుంటారు. తియ్యటి పళ్లను పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మామిడి కాయలను కోసి వాటిమీద కారం, ఉప్పు చల్లుకుని తింటే ఆ మజానే వేరుగా వుంటుంది. పెరుగన్నంలో మామిడి పండు రసం కలుపుకుని తింటే ఆ మజా కూడా మరో రకం. మామిడికి నాలుగు వేల ఏళ్ల చరిత్ర వుంది. ఇది భారతదేశపు జాతీయఫలం. వీటిని తింటే శరీరానికి కెరోటిన్, విటమిన్ సి, కాల్షయం పుష్కలంగా లభిస్తాయి. అయితే ఈ పళ్లు ఎన్నిరకాలు వుంటాయో తెలుసుకుందాం. దాదాపు 40 కి పైనే వుంటాయి ఈ పండు రకాలు.

మామిడి పళ్లలో ఉన్నన్ని రకాలు మరే పళ్లలోనూ లేవు. ఒక్కటి ఒక్కో రుచి. కొన్నింట్లో కండ రుచి, కొన్నింట్లో రసం రుచి, కొన్నింట్లో తోలు రుచి. ఏదైనా సరే జిహ్వకు విందే విందు.

Tasty Mango the King in fruits eaten by indians with love typeso of the fruits benefits and precautions

మామిడిపళ్లు రకాలు..

 1. బంగినపల్లి
 2. నీలం
 3. చందూరా
 4. రుమానియా
 5. మల్గోవా
 6. చక్కెర కట్టి
 7. గిర్ కేసర్ మామిడి
 8. అంటు మామిడి (చిలకముక్కు, బెంగుళూరు మామిడి)
 9. రసాలు
 10. చిన్న రసాలు
 11. పెద్ద రసాలు
 12. చెరుకు రసాలు
 13. షోలాపూరి
 14. అల్ఫాన్సా
 15. నూజివీడు రసం
 16. కోలంగోవా
 17. పంచదార కలశ
 18. ఏండ్రాసు
 19. సువర్ణ రేఖ
 20. కలెక్టరు
 21. పండూరివారి మామిడి
 22. అంపిరేడు (కొండమామిడి)
 23. ఇమాం పసంద్
 24. దసేరి
 25. జహంగీర్
 26. నూర్జహాన్
 27. ఢిల్లీ పసంద్
 28. బేనిషా
 29. హిమాని
 30. నీల్‌షాన్
 31. పుల్లూర
 32. కొబ్బరి మామిడి
 33. ఇంటి మామిడి
 34. చాకులు
 35. ఆచారి
 36. జలాలు
 37. తోతాపురి
 38. చిత్తూరు మామిడి
 39. జొన్న రాసి మామిడి
 40.  తెల్ల గులాబి
 41. ఎర్ర గులాబి
 42. సొర మామిడి

రకాలు ఎన్ని ఉన్నా వీటినో ప్రముఖంగా కనిపిస్తున్న ఐదారు మాత్రమే. బేనిషా, బంగినపల్లి, తోతాపురి, రసాలు, నీలం ఎక్కువగా తింటున్నారు.

బంగినపల్లి మామిడి

దీని గురించి తెలియని వారుండరు మెత్తని కండ, తగినతం రసంతో నోట్లో వేస్తే కరిగిపోతుంది. . ఈ పండు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా బనగానపల్లెలో పుట్టింది. 1905-1922 మధ్య కాలంలో కర్నూలు సంస్థానాన్ని నవాబు మీర్‌ గులాం అలీఖాన్‌ పాలించేవారు. ఆయన మామిడి పండులో మేలు జాతిగా పిలిచే బేనిషాన్‌ రకాన్నితమ సంస్థానంలో విరివిగా నాటించారు. దీనికే ‘బనగానపల్లె మామిడి’గా పేరు వచ్చింది. కాలక్రమంలో ఇది ‘బంగినపల్లి’గా మారింది. ఇక్కడి నుంచే తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు ఈ రకం సాగు విస్తరించింది. ప్రతి ఏటా 5500 టన్నుల బంగినపల్లి మామిడి పండ్లు అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు ఎగుమతి అవుతాయి. ఒక్కో పండు రెండు కిలోల వరకు తూగుతుంది. ఏమాత్రం పీచు లేకుండా పూర్తిగా గుజ్జు మాత్రమే ఉండడం ఈ పండు ప్రత్యేకత. అన్నీ రకాల పళ్ళు రూపంలో కాస్త అటూ ఇటుగా వున్న రుచిలో దేనికవి ప్రత్యేకమైనవే. బేనీషాన్ పండు కూడా ఈ జాతిదే.  బనగాలపల్లె నవాబు తన తోటలోని ఓక్కో రకం మామిడి చెట్టుకి ఒక్కో గుర్తు(నిషాన్) చెక్కించేవాడు. ఒకదానికి గుర్తు మర్చిపోయారు. అందుకే ‘గుర్తు లేనిది’ (బే నిషాన్) పేరు పెట్టాడు. వాడుకలో అది కాస్తా బేనిషా అయ్యింది.

Tasty Mango the King in fruits eaten by indians with love typeso of the fruits benefits and precautions

తోతపురి..

తోతాపురిని కాయగానూ, పండుగానూ తినవచ్చు. ముక్కలుగా కోసుకుని తింటే ఈ పండు చాలా తియ్యగా వుంటుంది. మామిడి సీజన్ అయిపోయాక కూడా తోతపురి మార్కెట్లో లభిస్తుంది.

పెద్ద రసం..

చిన్న వాళ్ళనుండి పెద్ద వాళ్ల వరకు ఈ పండంటే పడి చస్తారు. కోతకు పనికి రాదు, రసం జుర్రుకోవల్సిందే.

మామిడితో ఉపయోగాలు..

ప్రపంచమంతటా మామిడిపళ్లను ఇష్టపడటంతో ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తున్నారు. భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్, మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. తాజా మామిడి పండులో పదిహేను శాతం చక్కెర, ఒక శాతం మాంసకృత్తులు, ఎ, బి, సి విటమిన్లు ఉంటాయి.

ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్‌చూర్ (మామిడి పొడి) అంటారు.

కాల్షియం, విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. మామిడి రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికడుతుంది అంటున్నారు నిపుణులు. మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్టు వారు కనుగొన్నారు. ఐదు రకాల మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌ను.. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, రక్త క్యాన్సర్ల బాధితులకు ఇచ్చి పరీక్షించారు. క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవటమే కాదు, ఇది రెండు క్యాన్సర్‌ కణాలను చనిపోయే స్థితికి తెచ్చినట్టు గుర్తించారు.

పాదాల పగుళ్ళుకు మామిడి జిగురుకు మూడురెట్లు నీళ్ళు కలిపి పేస్టులాగా చేసి ప్రతిరోజూ పాదాలకు  ఫూస్తే మంచి ఫలితం వుంటుంది. పంటినొప్పి, చిగుళ్ళ వాపు వున్నవాళ్లు రెండు కప్పులు నీళ్ళు తీసుకుని మరిగించాలి. దీనికి రెండు పెద్ద చెంచాలు మామిడి పూతను వేసి మరికొంత సేపు మరగనివ్వాలి. స్టవ్‌మీద నుంచి దింపి గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టాలి. అవసరమనుకుంటే ఇలా రోజుకు రెండు మూడుసార్లు చేయవచ్చు. ఆర్శమొలలు వున్నవారు అర చెంచాడు మామిడి జీడిని పొడి రూపంలో పెరుగు మీది తేటతో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. మామిడి ముక్కలకు చెంచాడు తేనెను, పిసరంత కుంకుమ పువ్వును, ఏలకులు, రోజ్‌వాటర్లను చిలకరించి ఆస్వాదిస్తే నీరసం మటుమాయం అవుతుంది. పచ్చి మామిడికాయను నిప్పుల మీద వేడిచేసి పిండితే సులభంగా గుజ్జు వస్తుంది. దీనికి కొద్దిగా చన్నీళ్ళను, పంచదారను చేర్చి తాగాలి. దీనివల్ల దప్పిక తీరడమే కాకుండా వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది.

కార్బైడ్ వినియోగం..

మామిడి కాయలను తొందరగా మాగబెట్టడానికి కొందరు వ్యాపారమే ధ్యేయంగా విచ్చలవిడిగా కార్బైడ్‌‌ను వినియోగిస్తుంటారు. దీని వాడకంతో ప్రజారోగ్యానికి తీవ్ర హాని వుంది. దీనిని నిషేధించినా కార్బైడ్‌ విక్రయం మళ్లీ దొంగచాటుగా కొనసాగుతూనే వుంది. న్యాయస్థానాలు కూడా కార్బైడ్‌ను వినియోగించవద్దని ఆదేశాలు ఇచ్చాయి. అయినా కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసం కార్బైడ్‌ మందును రహస్యంగా తీసుకువస్తున్నారు. సహజంగా పండ్లను మాగబెట్టే అవకాశాలున్నా త్వరగా మాగడానికి కార్బైడ్‌ మందును ఉపయోగిస్తున్నారు.

మామిడి కాయలను గతంలో బోద, గడ్డి తదితర వాటితో వ్యాపారులు, రైతులు మాగబెట్టేవారు. కానీ ప్రస్తుతం కాయలు పక్వానికి రాకముందే కొందరు వ్యాపారులు వీటిని కార్బైడ్‌తో మాగబెడుతున్నారు. కార్బైడ్‌ మందుతో మామిడి కాయలను మాగబెడితే మందులోని అసిటిలిన్‌ అనే వాయువు పండ్లకు సోకి వాటిని ప్రజలు తింటే పలురకాల జబ్బులు వస్తాయని పలువురు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రభుత్వం కార్బైడ్‌ మందు అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ పండ్లను ప్రజలు తింటే మానవుని శరీరంలోని కొన్ని ఆర్గాన్స్‌ దెబ్బతింటాయి.