గింగిరాల రాంబాబు రివ్యూ - MicTv.in - Telugu News
mictv telugu

గింగిరాల రాంబాబు రివ్యూ

September 15, 2017
హిట్ అనే మాట విని సునీల్ చాలాకాలమైంది. విజయం కోసం డ్యాన్సులు, సిక్స్‌ప్యాక్‌లు ఇలా ఎన్ని చేసినా అతడి ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు.  సునీల్ హీరోగా పనికిరాడని, హాస్యనటుడిగా మళ్లీ కెరీర్ ప్రారంభిస్తే బాగుంటుందనే విమర్శలు పెరిగిపోయాయి. ఉంగరాల రాంబాబుతో తనపై వస్తున్న విమర్శలకు సునీల్ సమాధానం చెప్పడం ఖాయమని అంతా భావించారు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు వంటి హృద్యమైన కథాంశాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సినిమా చేస్తుండటంతో ఈ సారి సునీల్ హిట్ కొడతాడని ఊహించారు. సునీల్ ఆశించిన ఫలితం దక్కిందా? హీరోగా అతడికి ఈ చిత్రం పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టిందా?లేదా? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
రాంబాబు(సునీల్) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. తాతయ్యే అతడిని కష్టమంటే ఏమిటో కూడా తెలియకుండా పెంచి పెద్దచేస్తాడు. తాత చనిపోవడంతో తమకు అన్ని అప్పులే ఉన్నాయని ఆస్తులేవి లేవనే నిజం రాంబాబుకు తెలుస్తుంది. దాంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో రాంబాబు బాదం బాబా(పోసాని కృష్ణమురళి)ని ఆశ్రయిస్తాడు. అనుకోకుండా రాంబాబుకు రెండు వందల కోట్ల నిధి దొరుకుతుంది. అదంతా బాబా దయవల్లే అని నమ్మిన రాంబాబు ప్రతి పనిని బాబాను సంప్రదించే చేస్తుంటాడు. అతడి ఆఫీస్‌లోనే ఉద్యోగిగా పనిచేసే సావిత్రి(మియాజార్జ్)కు రాంబాబు చాదస్తం నచ్చదు. రాంబాబులోని మూఢనమ్మకాల్ని పోగొట్టి అతడిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. సావిత్రిని పెళ్లిచేసుకుంటే నీకు అన్ని శుభాలే జరుగుతాయని బాబా చెప్పిన మాటలతో రాంబాబు కూడా ఆమెను ప్రేమిస్తుంటాడు. తన తండ్రిని ఒప్పిస్తేనే అతడిని పెళ్లి చేసుకుంటానని రాంబాబుకు సావిత్రి షరతు విధిస్తుంది. తన ప్రేమ కోసం సావిత్రి సొంత ఊరైనా కేరళలోని ఓ పల్లెటూరికి చేరుకున్న రాంబాబు అక్కడ ఆమె తండ్రి రంగానాయర్(ప్రకాష్‌రాజ్)ను కలుస్తాడు.  కమ్యూనిస్టు నాయకుడైన రంగానాయర్‌కు…రాంబాబు  మనస్తత్వం నచ్చదు. దాంతో అతడిని దూరం పెడతాడు. రంగనాయర్ చేత రాంబాబు ఎలా మంచివాడు అనిపించుకున్నాడు?తన ప్రేమను ఎలా గెలుపించుకున్నాడు? డబ్బే సర్వస్వం అనుకున్న రాంబాబు మనిషి గొప్పతనాన్ని ఎలా తెలుసుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
కథగా చెప్పుకుంటే మంచి పాయింటే అయినా  దర్శకుడు క్రాంతిమాధవ్ దానిని తెరపై ఆవిష్కరించడంలో పూర్తిగా తడబడ్డారు. మలుపులతో సినిమా ఆసక్తిగా చెప్పాలనే ప్రయత్నంలో అసలు పాయింట్ పక్కదారి పట్టడంతో  గందరగోళంగా తయారైంది. తెరపై ఏం జరుగుతుందో, ఏ పాత్ర ఎందుకు వస్తుందో అర్థం కాదు.  సినిమాలో దర్శకుడు ఏం చెబుతున్నాడో, ఏం చెప్పాలనుకున్నాడో అంతుపట్టదు.  ఓనమాలు, మళ్లి మళ్లీ ఇది రాని రోజు వంటి హృదయాన్ని హత్తుకునే సినిమాలు తీసిన క్రాంతిమాధవ్   సినిమానేనా అనే అనుమానం వస్తుంది. ఆయన మార్కు సంభాషణలుగానీ, సన్నివేశాలు కానీ భూతద్ధం పెట్టి వెతికినా  కనిపించవు.  కథలో బలం లేకపోయినా సునీల్ కామెడీతో సంతృప్తి చెందవచ్చనుకునే సగటు అభిమానులకు  ఆ విషయంలో నిరాశే మిగిలింది.  ప్రేక్షకుల్ని మనస్ఫూర్తిగా నవ్వించే ఒక్క సన్నివేశం సినిమాలో లేదు. కథకుడిగా, దర్శకుడిగా ఈ సినిమాతో పూర్తిగా నిరాశపరిచారు క్రాంతిమాధవ్. కామెడీ కథాంశంతో సినిమా చేయాలనుకోవడంలో తప్పులేదు. కానీ అందుకు తగ్గ పాత్రలు, సన్నివేశాల్ని సృష్టించుకోవడం ముఖ్యం. ఆ విషయంలో సరిగా దృష్టిసారించలేదాయన. రొటీన్‌గా సాగే సన్నివేశాలు,  సహనాన్ని పరీక్షించే పాటలు,పేరడీలు,  సంభాషణలు చెప్పడంతో తమ పని పూర్తయిందనట్లు కనిపించే పాత్రలతో సినిమా మొత్తం నిరాశగా  సాగుతుంది. శుభం కార్డు కోసం  ప్రేక్షకుల్ని ఎదురుచూసేలా చేసింది.
ఉంగరాల రాంబాబుతో కథల ఎంపికలో మరోమారు పొరపాటు చేశారు సునీల్. కామెడీ, ఎమోషన్స్ రెండింటి భారంపై అతడిపైనే ఉండటంతో దేనికి సరిగా న్యాయం చేయలేకపోయారు.  హీరోకు తక్కువ, జూనియర్ ఆరిస్ట్‌కు ఎక్కువ అన్న చందంగా అతడి పాత్ర కనిపిస్తుంది. ఎక్కడ  మెరుపులు కనిపించవు.బరువు పెరగడంలో డ్యాన్సుల్లో కూడా తడబడ్డారు. అతడి కామెడీ టైమింగ్‌కు తగ్గ సన్నివేశం ఒక్కటీ కనిపించదు. హీరోయిన్ మియాజార్జ్ కేవలం పాటలకు మాత్రమే పరిమితమైంది.  అభినయపరంగా ఆమె చేసిందేమీ ఉండదు. పవర్‌ఫుల్ కమ్యూనిస్టు లీడర్‌గా ప్రకాష్‌రాజ్ పాత్రను పరిచయం చేసిన దర్శకుడు ఆ స్థాయిలో అతడిని చూపించలేకపోయారు. సైకిల్ పోటీలు, కుక్కపిల్లతో కాలక్షేపం చేసే వ్యక్తిగా మార్చేసారు. మిగిలిన పాత్రల్లో ఒక్కటి గుర్తించుకోదగ్గది కనిపించదు.
సాంకేతికపరంగా సినిమాలో అద్భుతం అని చెప్పే హంగు ఒక్కటీ లేదు. చంద్రమోహన్ చింతాడ సంభాషణల్లో బలం లేదు. మనసుకు కదిలించే డైలాగ్‌లు మచ్చుకైనా కనిపించవు. జిబ్రాన్ బాణీల్లో దరువులు తప్ప ఏమీ వినిపించవు. కథానుగుణంగా పాటల క్రమం సరిగా లేదు. ఛాయాగ్రహణం అంతంతా మాత్రంగానే ఉన్నది.  పరుచూరి కిరీటి నిర్మాణ విలువలుబాగున్నా కథలో దమ్ము లేకపోవడంలో అవన్నీ వృథాఅయ్యాయి.
ఉంగరాల రాంబాబు మరో రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రం.  కథ, కథనాలు, పాత్రలు…ఎందులోను కొత్తదనం కనిపించదు. సునీల్ పరాజయాల పరంపరను ఈ చిత్రం కొనసాగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రేటింగ్2/5