హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నేరాలు పెరిగిపోతున్నాయి. దాడులు, దోపిడీలు నిత్యం వెలుగుచూస్తున్నాయి. ఆయుధాలతో బెదిరించి దోచుకోవడం, వినకపోతే దాడులకు సైతం వెనుకాడకపోవడం పరిపాటిగా మారింది. ఇటీవల బార్ ఓనర్ వెంకట్ రెడ్డి నుంచి దుండగులు రూ.2 కోట్లు ఎత్తుకెళ్లిన కేసు తేలకముందే మరోసారి దోపిడీ కేసు వెలుగుచూసింది. మేడ్చల్ జిల్లాలో వైన్ షాప్ సిబ్బందిని గన్‌తో బెదిరించి రూ.2 లక్షలు ఎత్తుకెళ్లారు దుండగులు.
మేడ్చల్ జిల్లా .మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో మద్యం దుకాణం వద్దకు ముగ్గురు దుండగులు ముసుగులు వేసుకొని వచ్చారు. ముందుగా క్యాషియర్‌తో పాటు మరో ఇద్దరిపై కర్రలతో దాడి చేశారు. వారు ఎదురుతిరగడంతో తుపాకీతో బెదిరించి రూ.2 లక్షలను చోరీ చేశారు. ఈ సమయంలో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత డబ్బులతో అక్కడినుంచి దుండగులు పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.