మలి వయస్సులో కంటికి రెప్పగా చూసుకోవాల్సిన కన్నతండ్రిని ఆ కొడుకు.. పట్టించుకోలేదు. నలుగురు సంతానం ఉన్నా.. ఎవరూ లేని వాడిగా, ఆ తండ్రి వృద్థాశ్రమంలో బతుకు భారంగా గడుపుతున్నాడు. కుమారుడి తీరుతో విసిగిపోయిన అతడు.. తన ఆస్తికి తన పిల్లలు వారసులు కాదంటూ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోటిన్నర విలువైన ఆస్తిని గవర్నర్‌కు రాసిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లా బిరాల్ గ్రామానికి చెందిన రైతు నాథు సింగ్ (80)కు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉండగా.. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. భార్య కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో నాథు సింగ్.. కొడుకు వద్దే ఉంటున్నాడు.
అయితే, కొడుకు, కోడలు తన పట్ల ప్రవర్తించిన తీరుతో కలత చెందిన నాథు సింగ్.. వృద్ధాశ్రమంలో గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తన మరణానంతరం తన ఆస్తిని కుమారుడికి రాసేచ్చేది లేదంటూ.. తనకున్న భూమిలో పాఠశాల లేదా ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మించాలని కోరుతూ ఆ రాష్ట్ర గవర్నర్‌కు అఫిడవిట్ దాఖలు చేశారు. ‘ఈ వయసులో నేను నా కొడుకు, కోడలుతో కలిసి ఉండాల్సింది కానీ వారు నన్ను సరిగా చూసుకోవడంలేదు.. అందుకే ఆస్తిని సక్రమంగా వినియోగించుకునేలా గవర్నర్‌కు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపాడు.
వృద్ధాశ్రమం ఇన్‌చార్జి రేఖా సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయంలో సింగ్ మొండిగా ఉన్నారని, చనిపోతే కుటుంబ సభ్యులను కూడా తన అంత్యక్రియలకు హాజరు కావడానికి కూడా ఇష్టపడటం లేదని చెప్పాడని అన్నారు. స్థానిక సబ్-రిజిస్ట్రార్ అధికారి పంకజ్ జైన్ మాట్లాడుతూ.. ‘నాథు సింగ్ అభ్యర్థన ప్రకారం రిజిస్ట్రేషన్ చేశాం… అతడి నివాస గృహం, 10 బిగాల వ్యవసాయ భూమి, రూ. 1.5 కోట్ల విలువైన స్థిరాస్తులను అఫిడవిట్‌లో వెల్లడించారు.. ఆయన మరణానంతరం ఇది అమల్లోకి రానుంది’ అని తెలిపాడు.