వలస ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఎన్నికల సమయంలో ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్లిన ఓటర్లు.. సొంతూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఎక్కడి నుంచైనా ఓటు వేసే సౌలభ్యాన్ని వలస ఓటర్లకు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. అందుకోసం రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషన్ నమూనాను రూపొందించామని తెలిపింది. జనవరి 16న మెషీన్ ని ప్రదర్శిస్తున్నామని, దీనికి రాజకీయ పార్టీలను ఆహ్వానించామని చెప్పింది. దీంతో పాటు పోల్ ప్యానెల్ రిమోట్ ఓటింగ్ పై కాన్సెప్ట్ నోట్ కూడా విడుదల చేసింది. దీన్ని అమలు చేయడంలో పరిపాలనా, చట్టపరమైన, సాంకేతిక సవాళ్లపై పొలిటికల్ పార్టీల అభిప్రాయాన్ని కోరింది. కాగా, ఈ నూతన పద్ధతి అందుబాటులోకి వస్తే వలస ప్రజలకు చాలా మేలు జరుగుతుందని, అభ్యర్ధులకు కూడా ఖర్చు తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.