కరోనాతో గతం గుర్తుతెచ్చుకున్న గజినీ..  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో గతం గుర్తుతెచ్చుకున్న గజినీ.. 

March 26, 2020

Migrant worker suffered from amnesia suddenly remembers his past 

కరోనా చిత్రాలు ఇన్నీ అన్నీ కావు. మనుషులను చంపి పాతరేస్తున్న ఈ వైరస్ కొన్ని విషయాల్లో కొంత మేలే చేస్తోందిలెండి. గాలికాలుష్యం బాగా తగ్గింది. మనుషులు ఇళ్లలోనే ఉండడంతో బంధాలు బలపడుతున్నాయి. ఈ జాడ్యానికి పుట్టిల్లయిన చైనాలో గతం మర్చిపోయిన ఓ గజినీకి చాలా చాలా చాలా మేలు జరిగింది. కరోనా పుణ్యమా అని అతనికి 30 ఏళ్ల తర్వాత గతం గుర్తుకొచ్చింది. 

ఫుజియాన్ రాష్రంలోని గయజౌకు చెందిన జూ జియామింగ్‌కు ఇప్పుడు 57 ఏళ్లు. 30 ఏళ్ల కిందట అతడు హుబీ రాష్ట్రానికి వలస వెళ్లాడు. కూలిపని చేస్తుండగా తలకు పెద్ద గాయమైంది. అప్పట్నుంచి తన ఊరి పేరు, కుటుంబసభ్యుల పేర్లు మరిచిపోయాడు. ఐడీ కార్డు కూడా పోవడంతో మరింత చిక్కొచ్చిపడింది. మనసుసున్న ఓ జంట అతన్ని చేరదీసింది. పోలీసులకు విషయం చెప్పింది. కానీ సరైన వివరాల్లేకపోవడంతో వారూ చేతులెత్తేశారు. 2015లో జియామింగ్ తన ఊరు గుర్తుకొస్తోందని, తనది జియామింగ్ జీజాంగ్ ప్రాంతమని చెప్పాడు. పోలీసులు అక్కడికి పట్టుకెళ్లగా మతిమరపు వల్ల కథ మళ్లీ మొదటికొచ్చింది. 

కరోనా పుణ్యమా అని అతనికి ఊరు టక్కున గుర్తుకొచ్చింది. కరోనా వార్తల్లో అతని ఊరును గయజౌను చూపించారు. అక్కడ ఇళ్లు, ప్రాంతాలను చూసి జియామింగ్ అదే తన ఊరు అని ఎగిరి గంతేశాడు. నేరుగా పోలీస్ స్టేషనుకు వెళ్లి తన కుటుంబ వివరాలు చెప్పాడు. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు లాక్ డౌన్ కారణంగా అతనికి ఇప్పటికిప్పుడు సొంతూరి వెళ్లే అవకాశం లేదు. కానీ, జియామింగ్ ఎప్పుడో చనిపోయి ఉంటాడని భావించిన అతని కుటుంబసభ్యులు సంతోషం పట్టలేకుండా ఉన్నారు. అతడు వారితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ‘నా బిడ్డే, నా బంగారమే..’ అంటూ అతని 83 ఏళ్ల తల్లి సంబరపడిపోయింది.