కాలు విరిగినా నడుస్తూ… ప్రభుత్వాలకు సిగ్గుందా?  - MicTv.in - Telugu News
mictv telugu

కాలు విరిగినా నడుస్తూ… ప్రభుత్వాలకు సిగ్గుందా? 

March 31, 2020

మన పాలకుల మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గడప దాటడం లేదనేది లాక్‌డౌన్‌తో స్పష్టమైంది. కరోనాను కట్టడి చేయడం ఏమో కానీ ఆకలి చావులు, వేలాది మంది కూలీలు నడక దారిలో నరకయాతన అనుభవిస్తూ సొంత గ్రామాలకు పయనమవడం మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇస్తున్నా అవి వారి కడుపు నింపడం లేదు. దిక్కుతోచని స్థితిలో వందల కిలోమీటర్లు నడక మార్గంలో వెళ్తూ చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. పొట్టచేత పట్టుకొని వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికులు సొంత గ్రామాలకు ఆపసోపాలు పడుతూ చేరుకుంటున్నారు. నెత్తిన మూటలు, చంకలో బిడ్డలతో తిండి,నిద్ర లేకుండా గమ్యం కోసం వెళ్తున్న ఘటనలు కంటనీరు పెట్టిస్తున్నాయి.  తాజాగా కాలు విరిగిన ఓ వలస కూలి కట్టును విప్పుకొని మరీ నడుచుకుంటూ వెళ్లడం అందరిని కలిచివేసింది. 

రాజస్తాన్‌ నుంచి మధ్యప్రదేశ్‌కు వలస వచ్చిన  భన్వర్‌లాల్ అనే కార్మికుడు ఇటీవల గాయపడ్డాడు. అతని కాలు విరగడంతో వైద్యులు సిమెంటు కట్టు కట్టారు. ఇంతలో లాక్‌డౌన్ ప్రకటించడంతో తిండి దొరక్క,ఇంటికి వెళ్లేందుకు డబ్బులులేక అవస్థలు పడ్డాడు. చేసేదేమి లేక ఎలాగైనా 245 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామానికి వెళ్లాలని తన కాలికి కట్టిన సిమెంట్ కట్టును స్వయంగా తొలగించుకొని నడక ప్రారంభించారు. రోడ్డుపై అతని ధీన స్థితి చూసిన వారు చలించి పోయారు. ఓ వ్యక్తి  ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. వారంతా చలించిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. లాక్‌డౌన్‌లో వలస కూలీల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఇదే అద్దం పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా కూడా వారికి భరోసా లేకపోవడంతో ఇలాంటివి జరుగుతున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇకనైనా వలస కార్మికులకు అండగా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.