నడిచి నడిచి రక్తం కారుతోంది.. పాత చెప్పులుంటే ఇవ్వండి సార్ - Telugu News - Mic tv
mictv telugu

నడిచి నడిచి రక్తం కారుతోంది.. పాత చెప్పులుంటే ఇవ్వండి సార్

May 18, 2020

hhythhu

అయ్యా చెప్పులు ఉంటే దానం చేయండి.. ఇదేదో వినడానికి కొత్తగా ఉంది కదూ. కానీ ఇలాంటి ఘటనలో దేశంలో రోజుకు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. సొంత ఊళ్లకు వెళ్లే కూలీలు చాలా మంది కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వందల కిలోమీటర్లు వెళ్తూనే ఉన్నారు. ఇలా వెళ్లి వెళ్లి.. చివరకు కాళ్లు బొబ్బలు కట్టి, రక్తం కారుతుండటంతో నరకయాతన అనుభవిస్తున్నారు.ఇలా పాద రక్షల కోసం యూపీకి చెందిన తిలోకి కుమార్ అనే వలస కూలీ చెప్పుల కోసం యాచించాడు. రోడ్డు పక్కన ఎవరు కనబడితే వారిని పాత చెప్పులు ఉంటే ఇవ్వండి సార్ అని అందరిని అడగటం పలువురిని కంటతడి పెట్టించింది. 

గోరఖ్‌పూర్ జిల్లాలో పిప్‌రైచ్ గ్రామానికి చెందిన తిలోకి కుమార్ గుజరాత్‌లోని సూరత్ వస్త్ర పరిశ్రమలో పని చేస్తున్నాడు. లాక్‌డౌన్ కావడంతో ఇంటికి వెళ్లేందుకు శ్రామిక్ రైలులో ప్రయాణానికి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ స్పందన రాకపోవడంతో కాళ్లకు పని చెప్పాడు. దాదాపు 300 కిలోమీటర్ల దూరం నడిచాక అతనికి ఉన్న చెప్పులు అరిగి, తెగిపోయాయి. దీంతో కాళ్ల నుంచి రక్తం రావడంతో కనిపించిన వారిని అందరిని అడుగుతూ వచ్చాడు. చాలా మంది అన్నం, నీళ్లు అందిస్తున్నారని, చెప్పులు ఇచ్చే వారు లేరని వాపోయాడు. కొంత మంది సాయంగా డబ్బులు ఇచ్చినా దుకాణాలు లేకపోవడంతో వాటిని స్వీకరించలేదు. ఇలా అతని బాధలు విన్న ఓ వృద్ధుడు లక్నోలో శివారులో ఓ షాపు నుంచి చెప్పులు తీసుకొచ్చి అందరికి ఇచ్చారు. దీంతో వారంతా సంతోషంగా తమ నడక మార్గాన్ని అందుకొని ఇళ్లకు చేరారు. ఇలా కూలీలు తమ అనుభవాలను చెబుతుంటే వారి కష్టం ఎంతో మందిని కలిచివేస్తోంది.