వలస కూలీల బస్సు బోల్తా.. 33 మందికి గాయాలు
వలస కూలీలను రోడ్డు ప్రమాదాలు విడిచిపెట్టడం లేదు. తరుచూ ఏదో ఒక చోట వారు ప్రయాణిస్తున్న వాహనాల్లో అపశృతి చోటు చేసుకుంటూనే ఉంది. దీంతో ఎన్నో ఆశలతోొ సొంత ఊళ్లకు వెళ్దామని అనుకుంటున్నవారి ఇళ్లలో విషాదం నింపుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో 33 మంది గాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీలు కర్నాటక నుంచి సొంత గ్రామాలకు పయణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న బస్సు మందస మండలం బాలిగాం వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 33 మంది గాయపడ్డారు. ఇది జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికి చికిత్స అందిస్తున్నామని ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. వలస కూలీల బస్సు ప్రమాదం తెలిసిన బాధితులు బంధువులు ఆందోళనకు గురయ్యారు. వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.