వలస కూలీలు ప్రభుత్వాల తీరుపై కన్నెర్ర చేస్తున్నారు. ఉన్నచోట పనిలేక సొంత గ్రామాలకు వెళ్లనివ్వకపోవడంతో మండిపడ్డారు. దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు ఆందోళన బాట పట్టారు. పోలీసులు అడ్డుకున్నా సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధం కాడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. గుజరాత్,మహారాష్ట్ర, కేరళ, జమ్మూ రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి.
సూరత్ జిల్లా వరేలీ గ్రామంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వెయ్యి మంది వలస కూలీలు తమ రాష్ట్రానికి వెళ్లేందుకు రహదారిపైకి వచ్చారు. గుంపులుగా రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంతో వారంతా ఆందోళనకు దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులపైకి రాళ్లు రువ్వడతో వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పారు. అయినా పరిస్థితి అదుపుతప్పడంతో భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. వలస కూలీలు రాళ్లు విసరడంతో సూరత్ రేంజ్ ఐజీ ఎస్.పాండియన్ రాజ్‌కుమార్ సహా 11 మంది పోలీసులు గాయపడ్డారు.