కూలీలతో వెళ్తున్న ట్రక్కుకు ప్రమాదం..8 మంది మృతి
రోడ్డు ప్రమాదాలు వలస కూలీల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. సొంత ఊళ్లకు ప్రయాణమైన చాలా మంది మార్గ మధ్యలో ప్రమాదాలకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లా కాంట్ బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. 50 మంది వరకు గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు అధికారులు.
యూపీకి చెందిన కూలీలు కొంత కాలం క్రితం మధ్యప్రదేశ్‌కు పనుల కోసం వెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా తిరిగి సొంత ఊళ్లకు పయణమయ్యారు. ఈ క్రమంలో వారు ఓ ట్రక్కులో ఎక్కి కొంత దూరం ప్రయాణించారు. ఆ సమయంలో అదుపుతప్పిన లారీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న 8 మంది మృతిచెందారు. రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో సాయం కోసం కూలీలంతా రోదించారు. విషయం తెలిసిన పోలీసులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
యూపీలో ఆరుగురు మృతి :
యూపీలోని ముజఫర్‌నగర్‌లో మరో ప్రమాదం జరిగింది. కాలినడకన బిహార్ వెళ్తున్న వలస కూలీలను బస్సు ఢీ కొట్టింది. వేగంగా వచ్చిన వాహనం వీరి నుంచి దూసుకెళ్లడంతో ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.