లాక్‌డౌన్ వలస కూలీల పాలిట శాపంగా మారింది. ఉన్నచోట పనిలేక, సొంత ఊళ్లకు వెళ్లలేక తీవ్ర అవస్థలు పుడుతున్నారు. దీంతో వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. తమను గ్రామాలకు పంపాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. హైదరాబాద్‌లో బుధవారం భవన నిర్మాణ కార్మికులు నిరసనకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు, కార్మికుల మధ్య జరిగిన ఘర్షణతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
కందిలోని ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ పనుల కోసం వివిధ ప్రాంతాల నుంచి 1,600 మంది వచ్చారు. వారంతా లాక్‌డౌన్‌తో ఇక్కడే ఇరుక్కుపోయారు. ఇంత కాలం వేచి చూసిన వీరంతా.. ఎంత కాలం పనులు లేకుండా ఉండాలో తెలియకపోవడంతో ఎలాగైనా ఇళ్లకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. విషయం తెలిసిన వెంటనే కూలీలను అడ్డుకునేందుకు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆగ్రహించిన కార్మికులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాడిలో రెండు పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. అదనపు బలగాలు అక్కడికి వచ్చి కూలీలను అదుపులోకి తెచ్చాయి.