ప్రసవించిన 2 గంటలకే 150 కి.మీ నడక
లాక్‌డౌన్‌లో వలస కార్మికుల ధీన స్థితి దయనీయంగా మారింది. చంకలో బిడ్డలు, నెత్తిన మూటలతో ఎంతో మంది తల్లులు వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. కొన్నిసార్లు గర్భిణీలు కూడా సాహసం చేసి నడుచుకుంటూ వెళ్తూ.. రోడ్డుపైనే ప్రసవిస్తున్న ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కేవలం 2 గంటలకే తన నడక ప్రయాణాన్ని ప్రారంభించింది. మహారాష్ట్ర - ఆగ్రా రహదారిపై ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాకు చెందిన రాకేశ్ కౌల్, శకుంతల దంపతులు కూలీ పనుల కోసం నాసిక్‌కు వెళ్లారు. లాక్‌డౌన్‌తో పనులు లేక 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంత ఊరికి పయనమయ్యారు. అప్పటికే శంకుతలకు 9 నెలలు నిండినా కూడా ధైర్యం చేసి భర్తతో కలిసి నడిచింది. 70 కిలోమీటర్లు నడిచిన తర్వాత పురిటి నొప్పులు రావడంతో రోడ్డు పక్కనే ప్రసవం జరిగింది. తోటి కార్మికులు ఆమెకు సపర్యలు చేశారు. రెండు గంటలు విశ్రాంతి తీసుకున్న తర్వాత తన చంటి బిడ్డతో కలిసి అలాగే మండుటెండలో పడుతూ లేస్తూ.. గమ్యం చేరేందుకు సిద్ధమైంది. మార్గమధ్యలో బాలింతను గమనించిన ఓ సిక్కు కుటుంబం వారిని ఆహారం అందించారు. బిజాసాన్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలో వారు పడిన కష్టాలు విని అంతా కన్నీరు పెట్టుకున్నారు.