Mike TV Special Article on Politicians' PADAYATRA
mictv telugu

పాదయాత్ర ఫర్ పవర్.. ఈ సారి ఏం కానుంది?

February 8, 2023

Mike TV Special Article on Politicians' PADAYATRA

రాజకీయాల్లో పాదయాత్రకు ప్రాధాన్యం పెరిగిపోతోంది. పాదయాత్ర చేస్తే కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఒక సెంటిమెంట్ ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటివరకు పాదయాత్ర చేసిన వారు తర్వాత ఎన్నికల్లో ఓటర్లపై బలమైన ప్రభావం చూపి తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో సక్సెస్‌కి మారుపేరైన పాదయాత్రను అన్ని పార్టీల్లోని నాయకులు ఆశ్రయిస్తున్నారు. అయితే కేవలం పాదయాత్రతోనే విజయాలు వచ్చాయా? అంటే కాదు కానీ అవి వారి విజయాల్లో కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు నేలపై జరిగినన్ని పాదయాత్రలు ఇంకెక్కడా జరిగి ఉండవు. తెలంగాణలో హాత్ సే హాత్ జోడో పేరుతో రేవంత్ రెడ్డి యాత్ర మొదలైంది. వైఎస్సార్టీపీ అధినేత షర్మిల కూడా కొన్ని నెలలుగా తిరుగుతున్నారు. బండి సంజయ్, భట్టి విక్రమార్కలు పాదయాత్రలు చేశారు. ఏపీలో లోకేశ్ యువగళం పేరుతో కాలిబాట పట్టారు. ముందు ముందు మరికొంత మంది రోడ్లెక్కె అవకాశముంది.

మొదట ఎవరు ప్రారంభించారు?

పాదయాత్రకు ఆద్యుడు మహాత్మా గాంధీ గారు. స్వాతంత్ర్య సాధన కోసం 1930లో ఉప్పు సత్యాగ్రహం కోసం చేసిన పాదయాత్ర ఓ మైలురాయిగా నిలిచింది. తర్వాత 1934లో అంటరానితనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పాదయాత్ర చేశారు. గాంధీ తర్వాత స్వాతంత్య్రానంతరం వినోభా భావే 1951లో భూదానోద్యమం పేరిట తెలంగాణ నుంచి బీహార్ వరకు నడిచి చైతన్యం తీసుకొచ్చారు. అనంతరం 1983లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ ఆరు నెలల పాటు కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు 4 వేల 260 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు.

మలిదశ పాదయాత్ర – రాజశేఖర్ రెడ్డి శకం

ఇక పూర్తి రాజకీయాల పరంగా చూస్తే తెలుగు నేలపై దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ప్రముఖంగా ఉంటుంది. మలిదశ పాదయాత్రకు ఆయనను ఆద్యుడిగా భావిస్తారు. 2003లో చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 1500 కిలోమీటర్లు నడిచి ప్రజలతో మమేకం అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన పాదయాత్ర వల్ల 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారం కైవసం చేసుకుంది. అటు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర కీలక పాత్ర పోషించింది. దీంతో పాదయాత్ర చేస్తే వచ్చే ఫలితాలపై నాయకులకు నమ్మకం పెరిగిపోయింది.

చంద్రబాబు వస్తున్నా మీ కోసం

రాష్ట్ర విభజన కాలంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2013లో వస్తున్నా మీకోసం అంటూ 2800 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 60 ఏళ్లు దాటిన వయసులో ఆయన చేసిన యాత్ర వల్ల 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన సోదరి వైఎస్ షర్మిల 230 రోజుల పాటు 3 వేల కిలోమీటర్ల మేర నడిచి ప్రజల సానుభూతి సంపాదించింది. ఈ క్రమంలో అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మహిళగా గుర్తింపు పొందింది. తర్వాత సీపీఎం సహా ఇతర నాయకులు కలిసి 2013-2017లో 4 వేల కిలోమీటర్లు నడిచినా ఫలితం అంతంత మాత్రంగానే వచ్చింది.

వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర

తండ్రి మరణంతో కాంగ్రెస్ పార్టీతో విభేదాలు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2017లో ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు 3648 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది. ప్రజలకు భరోసా ఇస్తూ సాగిన ఈ యాత్ర వల్ల వైసీపీ పార్టీ 2019లో రికార్డు స్థాయిలో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లను తన ఖాతాలో వేసుకుంది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ పార్టీ కీలక, యువ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఇటీవల పాదయాత్ర చేశారు. 4 వేల 8 కిలోమీటర్ల మేర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్ము కశ్మీర్‌లలో సాగి శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ముగిసింది. వరుస ఓటములు, వీడుతున్న నాయకులు, వరుస రాజీనామాల మధ్య ఆ పార్టీ యువరాజు చేసిన పాదయాత్ర వల్ల కేడర్‌లో ఉత్సాహం రాగా, ఎంతవరకు లక్ష్యం నెరవేరుతుందనేది ఎన్నికల వరకు వేచి చూడాలి.

మన దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?
ఎన్నికలు దగ్గర పడుతున్నందున దాదాపు అన్ని పార్టీల నాయకులు పాదయాత్రలు చేస్తున్నారు. ఏపీలో నారా లోకేష్ యువగళం పేరుతో చేస్తున్న యాత్ర కొనసాగుతోంది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర జరుగనుంది. ఇచ్ఛ అనే అర్ధం ఉన్నందున యాత్ర లక్ష్యం నెరవేరుతుందని లోకేశ్ నమ్మకంతో ఉన్నారు. అదలా ఉంటే తెలంగాణలో జరుగుతున్న పాదయాత్రలది మరో లెక్క. ఇప్పటికే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలి హోదాలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేయగా, మధ్యలో కొంత విరామం తర్వాత మళ్లీ మొదలు కానుంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట విడతల వారీగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదలైన ఈ యాత్ర రోజుల క్రితం మొదలైంది. అయితే వైఎస్, చంద్రబాబు, జగన్ ఇలా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర చేసి విజయం సాధించారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా మూడు పార్టీల నేతలు వరుస పాదయాత్రలు చేస్తుండడంతో ఫలితం ఎలా ఉంటుందోననే ఆసక్తి ఏర్పడింది. తెలంగాణ ప్రజలు వీరిలో ఎవరిని ఆదరిస్తారనే ఉత్కంఠ నెలకొంది.