Mikhail Gorbachev, who ended the Cold War, dies aged 91
mictv telugu

సోవియట్ యూనియన్ చివరి అధినేత కన్నుమూత

August 31, 2022

సోవియెట్ యూనియన్ చివరి అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ (91) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రష్యా సెంట్రల్ క్లినికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గోర్బచేవ్ మృతి పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తెరలేచిన అమెరికా-సోవియెట్ యూనియన్ ప్రచ్ఛన్న యుద్ధానికి శాంతియుతంగా ముగింపు పలకడంలో గోర్బచేవ్ కీలకంగా వ్యవహరించారు. సోవియెట్ యూనియన్‌లో నిరంకుశత్వానికి తెరదించి ఆ వ్యవస్థను ప్రజాస్వామికీకరించేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే ఈ సంస్కరణలు కమ్యూనిస్ట్ పార్టీని బలహీనపరిచాయనే విమర్శలున్నాయి.

1985 నుంచి 1991 వరకు సోవియట్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు, సోవియట్‌ నేతృత్వంలోని తూర్పు దేశాలకు మధ్య ఏళ్ల తరబడి జరిగిన ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఆయన నేతగా ఉన్నారు. గోర్బచేవ్‌ అంత్యక్రియలు మాస్కోలోని నొవోడెవిచి శ్మశాన వాటికలో జరగనున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించినందుకు గోర్బచేవ్‌కు 1990లో నొబెల్‌ శాంతి బహుమతి లభించింది.