మిల్క్ ఏటీఎం.. హైదరాబాద్‌లో తొలిసారి  - MicTv.in - Telugu News
mictv telugu

మిల్క్ ఏటీఎం.. హైదరాబాద్‌లో తొలిసారి 

October 24, 2020

Milk ATM .. for the first time in Hyderabad.jp

ఏటీఎంల ద్వారా డబ్బులే కాదు, మంచినీళ్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా పాల సరఫరా చేసే ఏటీఎం కూడా వచ్చేసింది. తమకు ఎన్ని పాలు కావాలో ఆ ఏటీఎంలో బటన్ నొక్కి పాలను ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఎల్బీనగర్‌ పరిధిలో ఉన్న హస్తినాపురం డివిజన్‌ హనుమాన్‌నగర్‌ చౌరస్తాలో  ఈ పాల ఏటీఎం ఏర్పడింది. నిన్నటి నుంచి (శుక్రవారం) ఈ మిల్క్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోనే ఫస్ట్ పాల ఏటీఎంగా వచ్చిన ఈ ఏటీఎంను శ్రీ గీతా డెయిరీ చైర్మన్ లక్ష్మీనరసింహ గుప్తా ఏర్పాటు చేశారు.

ఈ పాల ఏటీఎంతో ఆ ప్రాంత ప్రజలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎప్పుడు పాలు కావాలంటే అప్పుడు తీసుకెళ్లొచ్చు. ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలను తీసుకెళ్లే వెసలుబాటు కల్పించారు. వినియోగదారులు ఓ బాటిల్ లేదా, ఒక పాత్రను వెంట తీసుకుని వెళ్లాలి. పాల ఏటీఎంలోకి ప్రవేశించాక అవసరం మేరకు అక్కడ ఉండే లీటర్‌, అర లీటర్‌, పావు లీటర్‌ బటన్ నొక్కగానే అన్నే పాలు వస్తాయి. అయితే తీసుకున్న పాలకు డబ్బులు మాత్రం అక్కడ ఉండే స్టాఫ్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. మార్కెట్‌ ధరల ప్రకారమే మిల్క్ ఏటీఎంల వద్ద పాల ధరలు ఉన్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ఇలాంటి ఏటీఎం రాష్ట్రంలోనే మొదటిదని, నిత్యం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దీని సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.