మనిషి రూపంలోని చిరుత, వరల్డ్ ఫాస్టెస్ట్ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కూడా డబ్బుల విషయంలో బోల్తాపడ్డాడు. ఓ మోసగాడు అతణ్ని బురిడీ కొట్టించి రూ. 103 కోట్లు కాజేశాడు. దీంతో జమైకా ప్రభుత్వం రంగంలోకి దిగి అతనితోపాటు మోసపోయిన మిగతావారికీ న్యాయం చేసే పనిలో పడింది. ఒలింపిక్ మెడలిస్ట్ అయిన బోల్ట్‌కు స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అనే కంపెనీలో రిటైర్మెంట్ కమ్ లైఫ్ టైమ్ సేవింగ్స్ కేటగిరీలో ఖాతా ఉంది. అందులో 12.8 మిలియన్లు సొమ్ము జమ చేశాడు. అయితే ఇప్పుడు కేవలం 12వేల డాలర్లే మిగిలాయి. రూ.103 కోట్లు గల్లంతైంది. ఎలా పోయిందో తెలియదంటూ కంపెనీ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది. కంపెనీ ఉద్యోగుల్లో ఒకరు ఈ డబ్బును కొట్టేసినట్లు విచారణలో తేలింది. పది రోజుల్లోగా ఆ డబ్బును ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని కంపెనీ అతణ్ని హెచ్చరించింది. బోల్ట్ సొమ్ముతోపాటు మరో 28 మంది ఖాతాల్లోని సొమ్ము మాయమైనట్లు గుర్తించారు. లావాదేవీల సరిగ్గా నిర్వహించడం లేదంటూ జమైకా ప్రభుత్వం కంపెనీని తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంది.