చిన్నకుటుంబమూ దేశభక్తే అన్న మోదీపై ఒవైసీ ఫైర్
దేశంలో జనాభ విస్ఫోటం సాగుతోందని, చిన్న కుటుంబాన్ని కలిగి ఉండడం కూడా దేశభక్తేనని ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పంద్రాగస్టు సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. అవి పనికిమాలిన, అవాంఛనీయ వ్యాఖ్యలని తప్పుబట్టారు. దేశంలో ఇప్పుడు యువతీయువకుల జనాభా ఎక్కువగా ఉన్నా, అది 2040 వరకు మాత్రమేనని చెప్పారు. వారు ఇప్పుడేం చేయాలో చెప్పలేక మోదీ చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. మోదీ ముస్లింలను ఉద్దేశించే అలా అన్నారనే అర్థంలో ఒవైసీ ఆరోపణలు గుప్పించారు.
‘భారతీయుల్లో మెజారిటీ భాగం యువతే. అయితే 2040 వరకు మాత్రమే దీని వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ యువశక్తిని ఎలా వాడుకోవాలో పీఎంఓ చెప్పడం లేదు. అందుకే ఆయన తన బాధ్యత నుంచి తప్పించుకోడానికి ఇలా మాట్లాడుతున్నారు’ అని ఒవైసీ ట్వీట్ చేశారు. మోదీ ఈ రోజు ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ. . బిడ్డలను కనేముందుకు వారికి అన్ని సదుపాయాలూ కల్పిస్తామా లేదా అని ఆలోచించుకోవాలని, అలాంటి వారు మన దేశంలో ఉన్నారని చెప్పారు.