కాషాయ పార్టీకి ఎంఐఎం ప్రియమైన శత్రువా? - MicTv.in - Telugu News
mictv telugu

కాషాయ పార్టీకి ఎంఐఎం ప్రియమైన శత్రువా?

August 4, 2019

MIM party benefiting bjp in many state elections by contesting

ముస్లిం ఇత్తెహాదుల్ ముస్లిమీన్, క్లుప్తంగా చెప్పాలంటే ఎంఐఎం. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఈ పార్టీ దక్కన్ పీఠభూమి ఏరియాలో పాగా వేసేందుకు తెగ ఉత్సాహపడుతోంది. అంతేకాదు, దాదాపు ఐదేళ్ల నుంచి దేశవ్యాప్తంగా ముస్లింలు అధికంగా ఉన్న రాష్ట్రాల మీద కన్నేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎక్కడ అవకాశం కుదిరితే అక్కడ తమ అభ్యర్ఠులను బరిలో దింపుతున్నారు. గెలుస్తామా, లేదా అన్నది ఆయన పట్టించుకోవడం లేదు. తాజాగా 2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామంటూ ఒవైసీ ప్రకటన చేశారు. అక్కడ తమకు క్యాడర్ లేకపోయినా పోటీ చేస్తామనీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీ తమను శత్రవుగా భావించినా, మిత్రత్వానికి సిద్ధమైనా తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ట్వీట్ కూడా చేశారు. ఇదే ఇప్పుడు సరికొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చేలా చేస్తంది. ఎందుకంటే, అసదుద్దీన్ ఒవైసీ తీరు చూస్తుంటే ఆయన బీజేపీకి ప్రియమైన శత్రువు అన్న వాదనకు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో క్రమంగా బలం చేకూరుతోంది. ఇందుకు చాలా ఉదాహరణలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఎంఐఎం గతంలో పోటీ చేసిన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను ఓసారి గమనిస్తే, ఆశ్చర్యకరమైన నిజాలు అర్థం అవుతాయి. 

2012 అక్టోబరులో నాందేడ్ సౌత్ మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చిన ఎంఐఎం, బీజేపీ ప్లస్ పాయింట్ అయ్యేలా చేసింది. కాంగ్రెస్ పార్టీని రెండో స్థానానికి నెట్టేసిన ఎంఐఎం 13 వార్డులు గెల్చుకుంది. అలాగే 2013 మార్చిలో జరిగిన కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరు చోట్ల గెలిచిన ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మీద దెబ్బకొట్టింది. ఇక 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 24 సీట్లలో పోటీ చేసి, 2 నియోజకవర్గాల్లో గెలిచింది. బైకుల్లా సీటు నుంచి ఎంఐఎం అభ్యర్థి వారిష్ యూసఫ్ పఠాన్ కాంగ్రెస్ అభ్యర్థి మీద 25,314 ఓట్లతో గెలిచారు. అలాగే ఔరంగాబాద్ సీటు నుంచి ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ కాంగ్రెస్ అభ్యర్థి మీద 30,000 ఓట్లతో గెలిచారు. ఈ రెండు సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సి ఉంది. అయితే ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ స్థానాల్లో హిందూ ఓటర్లు బీజేపీ, శివసేనల వైపు మొగ్గుచూపడం, ముస్లింలు ఏకపక్షంగా ఎంఐఎంకు ఓటేయడంతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 

ఈ రెండు ఫలితాల మీద బీజేపీ, శివసేన అంతగా పట్టించుకోక పోయినా, కాంగ్రెస్, ఎన్సీపీలకు గట్టి ఝలక్ తగిలింది. అలాగే 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలకు ఓ రకంగా ఝలక్ ఇచ్చింది ఎంఐఎం. మొత్తం ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న 38 స్థానాల్లో పోటీ చేసింది. ఒక్క చోట కూడా గెలవక పోయినా, 0.2 శాతం ఓటింగ్ సంపాదించుకుంది. సంభల్ నియోజక వర్గంలో 60,426 ఓట్లతో రెండో స్థానంలో నిలిచిన ఎంఐఎం, మరో మూడు సీట్లలో కూడా ఇదే హవా కొనసాగించింది. అంతేకాదు, ముస్లిం ఓట్లను చీల్చి 17 సీట్లలో బీజేపీ విజయానికి అవకాశం కల్పించింది. ముఖ్యంగా టాండా సీటులో 1723 ఓట్లతో, షరావస్తి సీటులో 445 ఓట్లతో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఈ రెండు సీట్లలో ముస్లిం ఓట్ల చీలిక ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థుల విజయానికి గండికొట్టింది. అంతేకాదు, ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద 78 వార్డుల్లో పోటీ చేసిన ఎంఐఎం 29 వార్డులు గెల్చుకుంది. ముఖ్యంగా ఫిరోజాబాద్ మేయర్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టిన ఎంఐఎం 56,536 ఓట్లు సాధించి, సమాజ్ వాదీ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. ఈ చీలికతో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవశం చేసుకుంది. ఈ విధంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒవైసీ పార్టీ, సెక్యులర్ పార్టీలకు ఝలక్ ఇచ్చి, బీజేపీకి అడ్వాంటేజ్ చేసింది. 

ఇక ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఇప్పటికే మొన్నటి బీహార్ వరద బాధితులకు 10 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించిన ఎంఐఎం, తన రాజకీయ ఎత్తుగడలో మొదటి పావు కదిపింది. ఇప్పుడు 2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం రెడీ అవుతోంది. ఎందుకంటే బెంగాల్లో బలమైన ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. దాన్ని టార్గెట్ చేస్తూ ఒవైసీ బరిలో దిగుతున్నారు. అయితే మమత బెనర్జీకి ఈ పరిణామం చాలా ఇబ్బందికర అంశంగా మారనుంది. ఎందుకంటే, ఇన్నాళ్లూ ముస్లిం ఓట్ బ్యాంక్ మీద బలమైన పట్టు సాధించి, పలు పథకాలతో వారి ఓట్ల కోసం పరుగులు పెడుతున్న మమత బెనర్జీ, హిందువులను దూరం చేసుకున్నారు. ఈ విషయం మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తేలిపోయింది. ఆ తర్వాత తాను సెక్యులర్ అంటూ ప్రసంగాలు మొదలు పెట్టారు మమత దీదీ. హిందువుల పండగల్లో నేరుగా పాల్గొనడం వంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. 

ఇదే సమయంలో ఎంఐఎం పార్టీతో మమత బెనర్జీ పొత్తు పెట్టుకుంటే, ముస్లిం పక్షపాతి అంటూ బీజేపీ ప్రచారం చేస్తుంది. ఇది వచ్చే ఎన్నికల్లో టీఎంసీ మీద తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఇప్పటికే మరోసారి బెంగాల్ పీఠం దక్కుతుందో, లేదో అన్న భయంతో ఉన్న మమత బెనర్జీ, ఎన్ని సీట్లు వస్తాయన్న దానిమీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలా మంది టీఎంసీ నేతలు బీజేపీలోకి వెళ్లడం కూడా ఆమెలో భయాన్ని మరింత పెంచుతోంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో ఎంఐఎంతో పొత్తుకు మమత బెనర్జీ ఏమాత్రం ఒప్పుకోరు. అదే జరిగితే మరోవైపు నుంచి ఇబ్బంది రావడం ఖాయం. ఎందుకంటే, ఎంఐఎం ఒంటరిగా బరిలో దిగితే ముస్లిం ఓట్ బ్యాంకులో కొద్దోగొప్పో చీలిక వస్తుంది. ఇది టీఎంసీ విజయావకాశాల మీద ప్రభావం చూపడం ఖాయం. ఈ పరిణామం బీజేపీకి లబ్ది చేకూరడం కూడా ఖాయమే. అందుకే ఒవైసీ విన్నపం మీద మమత బెనర్జీ నోరు మెదపడం లేదు. ముందు ముందు కూడా ఆమె మాట్లాడతారని భావించడం లేదు. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఏతావాతా అర్థం అవుతోంది ఏంటంటే, ఎంఐఎం ఎదగడం, పోటీచేయడం, సెక్యులర్ పార్టీలతో వెళ్లడం సంగతేమో కానీ, బీజేపీకి మాత్రం ఓ రకంగా కల్సొరావడం ఖాయమని అర్థం అవుతోంది. అందుకే బీజేపీకి ఎంఐఎం ప్రియమైన శత్రువుగా మేధావులు భావిస్తున్నారు.

MIM party benefiting bjp in many state elections by contesting