తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెర లేచింది. ఇన్నాళ్ళూ పాత బస్తీకే పరిమితమైన మజ్లిస్ పార్టీ.. తెలంగాణలో 50 స్థానాల్లో పోటీ చేసి 15 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెడతామని అక్బరుద్దీన్ చెప్పిన మాట చర్చకు దారి తీసింది. ఈ దెబ్బతో 7 సీట్ల పార్టీ అనే ముద్రకు ధీటైన జవాబు చెప్తామని అక్బరుద్దీన్ బల్లగుద్ది చెప్పారు. ఇప్పటివరకు అసెంబ్లీలో అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్ సీన్ కనపడుతూ వచ్చింది. కానీ బయట మాత్రం ఈ రెండు పార్టీలు భాయి భాయిగానే మింగిల్ అవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్య కీలకంగా మారింది. ఇప్పటివరకు హైదరాబాదుకే పరిమితమైన ఆ పార్టీ ఎప్పటినుంచో విస్తరించాలనే ప్రణాళికతో ఉంది. తనకు బలం ఉన్న స్థానాలను ఇప్పటికే గుర్తించింది.
ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట తన ఫోకస్ పెట్టింది. కరీంనగర్, సంగారెడ్డి, ఖమ్మం, అదిలాబాద్, బోధన్, కామారెడ్డి, సిర్పూర్, నిర్మల్, ముథోల్, భువనగిరి, వరంగల్ ఈస్ట్, మహబూబ్ నగర్, జహీరాబాద్, షాద్ నగర్, వికారాబాద్, కోరుట్ల నియోజకవర్గాల్లో గెలుపుకు అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ఒకవేళ ఈ ఓట్లు సరిపోకపోతే ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అవసరమైతే వారిలో సమర్ధుడైన నాయకుడికి టిక్కెట్ ఇచ్చి గెలిపించుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రాజేందర్ నగర్, అంబర్ పేట, నిజామాబాద్‌లలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లను రాబట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ పరిణామం తెలంగాణలో ఎవరికి మేలు చేస్తుందనే ప్రశ్న ఉదయిస్తోంది. మజ్లిస్ గెలుపు సంగతి ఎలా ఉన్నా పోటీ చేసే స్థానాల్లో ఓట్ల చీలిక మాత్రం గణనీయంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలి తిరిగి బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. గెలిస్తే ఓకే.. ఓడిపోయినా ఓట్లు చీలతాయి కాబట్టి రెండు వైపులా లాభమే తప్ప నష్టం ఉండదని ఇరు పార్టీల నేతలు ఆలోచిస్తున్నారట. కానీ మజ్లిస్ కనుక పోటీ చేస్తే అక్కడ బీజేపీ హిందూత్వ కార్డును ప్రయోగించి హిందూ ఓట్లను పోలరైజ్ చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు. అప్పుడు పోరు బీజేపీ వర్సెస్ మజ్లిస్‌గా మారుతుందని బీఆర్ఎస్‌కు ప్రాధాన్యం లేకుండా పోతుందని విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి