మేడారంలో బుధవారం మినీ వన జాతర మొదలైంది. ఈ రోజు (బుధవారం) మండ మెలిగే పండుగను నిర్వహిస్తున్నారు. గురు, శుక్ర వారాల్లో అమ్మవార్ల గద్దెలను శుద్ధి చేసి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సమ్మక్క-సారలమ్మ మేడారం ఆలయ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపిన వివరాల ప్రకారం… ఫిబ్రవరి 2న సమ్మక్క, సారలమ్మ దేవతలకు పసుపు, పచ్చిపూలతో పూజలు నిర్వహిస్తారు. మండ మెలిగే ఆచారం ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరగనుంది. గిరిజన జాతరకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
అయితే.. గతంలో ఈ మినీ జాతరకు మేడారం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మాత్రమే వచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు. రెండేళ్లకు ఓసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. మధ్యలో మినీ జాతర పేరిట ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే.. ఇందులో భాగంగా నేడు మండమెలిగే పండుగతో మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. ఈ మినీ జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం జరగదని, గద్దెలపై ప్రత్యేక పూజలు మాత్రమే చేస్తామని పూజారులు చెప్పారు.
మేడారం మినీ జాతర నేపథ్యంలో రెండు రోజుల నుండి భక్తులు మేడారానికి పోటెత్తారు. తలనీలాలు సమర్పించి, జంపన్న వాగుల పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవార్లకు బంగారాన్ని నివేదించి మొక్కలు చెల్లించుకుంటున్నారు. మేడారం చిన జాతరకు కూడా దాదాపు 5 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు ఏర్పాటు చేశారు.