ఏపీలో సినిమా టికెట్ల వివాదానికి త్వరలోనే ఫుల్స్టాప్ పడేలా సంకేతాలు కనిపిస్తున్నాయి. గురువారం సినిమా టికెట్ల ధరలపై ఏర్పాటైన కమిటీ టికెట్ ధరలు ఏ మేరకు పెంచాలన్న దానిపై చర్చించింది. అనంతరం ఫిలిం చాంబర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ముత్యాల రాందాస్ మాట్లాడుతూ “మూడు శ్లాబుల్లో టికెట్ ధరలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ కనీస ధర రూ. 40గా, పట్టణ ప్రాంతాల్లో రూ. 70కి దగ్గరగా ఉంటాయి. ప్రభుత్వం దీనికి కాస్తంత అటూ ఇటుగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి మరో వారం, పది రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది” అని ఆయన అన్నారు.
మరోపక్క ఇటీవలే సినీ పెద్దలు మెగస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నారాయణ మూర్తిలు సీఎం జగన్తో భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం జగన్తో భేటీ అయ్యారు.