ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తనదైన శైలిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ని విమర్శించారు. శనివారం సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సులో పవన్ చేసిన వ్యాఖ్యలపై అయన స్పందించారు. “ఇప్పటికైతే నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్. ఓటమి అనేది విజయానికి సగం పునాది. డబ్బున్న వాళ్లంతా గొప్పోళ్లు, పేరున్న వాళ్లంతా మహానుభావులు అనుకోవద్దు. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మొద్దు. దేవుడిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఏది తప్పు.. ఏది ఒప్పు అనేది నిర్ణయించుకోవాలి. మన వ్యక్తిగత విజయమే దేశానికి పెట్టుబడి” అంటూ పవన్ చేసిన ప్రసంగంపై అంబటి కౌంటర్‌గా ఆసక్తికర కామెంట్స్ చేశారు.
పవన్ కల్యాణ్ కేవలం నటుడిగానే విజయవంతం అయ్యారు. పొలిటిషయన్‌గా మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యారని అంబటి ఎద్దేవ చేశారు. కొన్ని ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్ కల్యాణ్ ఒక్కసారి కూడా గెలిచింది లేదని విమర్శించారు. ఇక ముందు కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. సైద్ధాంతిక విధానం అంటూ ఏమీలేని పవన్… రాజకీయల్లో తన పాత్రను సరిగా పోషించలేకపోతున్నారన్నారు. . విప్లవనేతగా పార్టీని ఏర్పాటు చేసి.. తనను తాను చేగువేరా అని చెప్పుకుంటాడని… కానీ, సిద్ధాంతాలను పక్కనబెట్టి కమ్యూనిస్టులతోనూ, బీజేపీతోనూ కలిశారని తెలిపారు. పవన్ ఎప్పటికీ ఫెయిల్యూర్ నాయకుడేనని స్పష్టం చేశారు.