Minister Ambati Rambabu Demands Bribe
mictv telugu

“చావు డబ్బులో సగం అడుగుతున్నారు..అంబటి కూడా అదే మాట”

December 20, 2022

Minister Ambati Rambabu Demands Bribe

కుమారుడు చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉంటే ..డబ్బులు కోసం నాయకులు రాబందుల్లా పీక్కుతింటున్నారని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన తురక గంగమ్మ, పర్లయ్య దంపతులు ఆరోపిస్తున్నారు. ప్రమాదవశాత్తు కుమారుడు చనిపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన నగదులో సగం డబ్బులను స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం దంపతుల సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ అంశంలో మున్సిపల్ చైర్ పర్సన్ భర్తతో పాటు మంత్రి అంబటి రాంబాబు పేర్లు రావడం చర్చనీయాంశమైంది.

పూర్తి వివరాల్లోకి వెలితే.. గుంటూరు సమీపంలోని దాసరిపాలెం నుంచి తురక పర్లయ్య కుటుంబం బతుకుదెరువు కోసం ఏడాది కిందట సత్తెనపల్లి వచ్చేసింది. రోడ్డు పక్కన పూరిల్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి ఓ కుమారుడు,కుమార్తె ఉన్నారు. పని నిమిత్తం వారి కుమారుడు అనిల్ డ్రైనేజ్ క్లీన్ చేస్తూ నాలుగు నెలల కిందట చనిపోయాడు. వారికి సీఎం సహాయనిధి నుంచి 5 లక్షల రూపాయలు 20 రోజుల కిందట వచ్చాయి. అయితే వాటిలో 2.5 లక్షలు ఇవ్వాలని మున్సిపల్ చైర్‎పర్సన్ భర్త చల్లంచర్ల సాంబశివరావు అడుగుతున్నాడపి మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం మంత్రి అంబటి రాంబాబు దగ్గరకు పోయినా డబ్బులు ఇవ్వాల్సిందే అన్నారని వారు ఓ వీడియోలో వెల్లడించారు. పోలీసులు కూడా డబ్బులిచ్చేయాలని చెప్తున్నట్లు పేర్కొన్నారు. తమ కుమార్తె పెళ్లి కోసం ఆ డబ్బులును దాచుకోవాలని చూస్తే..సగం డబ్బులు లంచం అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వైసీపీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నందన బెదిరింపులు కూడా వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు.

పరిహారం సొమ్ములో మంత్రి సగం వాటా డిమాండ్ చేశారంటూ బాధితులే స్వయంగా చెబుతున్నందున.. అంబటి రాంబాబు రాజీనామా చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను అంబటి రాంబాబు కొట్టిపారేశారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.