ఏపీలో గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పథకాలు లబ్దిదారులకు చేరుతున్నాయా? లేదా? అని పరిశీలించి అర్హులకు వాటిని చేరవేయడమే లక్ష్యంగా ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించారు. అయితే ఈ వ్యవస్థపై తాజాగా మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘వాలంటీర్లు ఎవరు? ఎవరు నియమించారు? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఆయన ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు వాలంటీర్లను నియమించారు. మరి ఎవరిని నియమించారు? పార్టీ కార్యకర్తల పిల్లలనే కదా. సానుభూతి పరులనే కదా. వారు ప్రభుత్వ పథకాలను చేరవేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా చేరవేస్తారు. అలాగే ప్రజల సమస్యలను పార్టీకి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు. అంటే ఒక రకంగా వారు వైసీపీ కార్యకర్తలే. వాళ్లలో ఎవరైనా మాట వినడం లేదా? చెప్పండి. అలాంటి వారిని తీసేసి కొత్తవారిని పెట్టుకుందాం. వాలంటీర్లను ఎమ్మెల్యేలు తమ చేతల్లో పెట్టుకోవాలి. తద్వారా పార్టీ గెలుపునకు వారి సేవలను వినియోగించుకోవాలి’ అని వెల్లడించారు. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను విమర్శించారు.
https://www.eenadu.net/videos/playVideo/minister-ambati-comments-on-voluntary-system/1/26800