వైసీపీలో పక్కచూపులు.. మాకేం కాదు కార్యకర్తలకే ఇబ్బంది : బొత్స - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీలో పక్కచూపులు.. మాకేం కాదు కార్యకర్తలకే ఇబ్బంది : బొత్స

July 2, 2022

ఏపీ విద్యాశాఖ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో జరిగిన వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన ‘క్రింది స్థాయి కార్యకర్తలు, నాయకులలో ఏదైనా అసంతృప్తి ఉంటే చర్చించి పరిష్కరించుకుందాం. అంతేకానీ, పార్టీని నాశనం చేసేలా ప్రవర్తించవద్దు. అధికారం ఉన్నా లేకున్నా మాకేం కాదు. గ్రామ, మండల స్థాయిలో ఉన్నవారికే ఇబ్బందులుంటాయన్న సంగతి గుర్తు పెట్టుకోండి. ఇప్పటికే కొందరు నాయకుల్లో పక్కచూపులు మొదలయ్యాయి. అదే జరిగితే అందరికీ నష్టం. సీఎం పనితీరు బాగుందని జనాలు అంటున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రతీ వంద రోజులకు సమావేశాలు నిర్వహిస్తే కార్యకర్తల కడుపులో ఉన్నది బయటపడుతుంది. దానిని జిల్లా సమావేశాల్లో పరిష్కరించుకుందామ’ని వ్యాఖ్యానించారు. ఇదే సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర మాట్లాడుతూ..‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మారితే రూ. 30 కోట్లు, అమరావతిలో ఇల్లు, మంత్రి పదవి, పిల్లల చదువు వంటి ఆఫర్లిచ్చారని, కానీ నేను వాటికి లొంగకుండా జగన్‌ను నమ్ముకున్నందుకు ఈ రోజు మంచి స్థాయిలో ఉన్నానని వెల్లడించారు. కాగా, పై వ్యాఖ్యలతో వైసీపీలో అసంతృప్తి మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిని నివారించేందుకు ఆ పార్టీ, వైఎస్ జగన్ ఏమేర చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.