‘జగన్ బలమైన నాయకుడు, అందుకే ట్రంప్ డిన్నర్‌కు పిలవలేదు’ - MicTv.in - Telugu News
mictv telugu

‘జగన్ బలమైన నాయకుడు, అందుకే ట్రంప్ డిన్నర్‌కు పిలవలేదు’

February 26, 2020

Jagan

భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా ఏపీలో కొత్త రాజకీయ దుమారం చెలరేగింది. రాష్ట్రపతి ఇచ్చిన విందుకు దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా దీనికి హాజరయ్యారు. దీంతో టీడీపీ కొత్త విమర్శలకు తెరలేపింది. జగన్‌ను ఎందుకు విందుకు ఆహ్వానించలేదో చెప్పాలంటూ  డిమాండ్ చేశారు. ఓ దశలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన్ను ఆర్థిక నేరగాడు కావడం వల్లే విందుకు పిలవలేదని సటైర్లు వేశారు. 

రెండు రోజులుగా అధికార విపక్షాల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధానికి తెరదించే ప్రయత్నం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. దేశంలో చాలా మంది సీఎంలకు ఈ ఆహ్వానం రాలేదని గుర్తు చేశారు. రాష్ట్రాల్లో ఎవరికైతే బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్న నేతలు ఉన్నారో వారిని పిలవలేదని చెప్పారు.  జగన్ బలమైన నేత కాబట్టే అందుకే ఆహ్వానం రాలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కడుపు మంటతో సీఎం జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు సార్లు ఒడిశా సీఎంగా పనిచేసిన నవీన్ పట్నాయక్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా ఆహ్వానం అందలేదన్నారు. కారణాలు ఏం ఉన్నా ఈ దేశంలో జగన్‌ బలమైన నాయకుడని బొత్స సమర్థించుకున్నారు.