minister botsa satyanarayana comments on rythu maha padayatra
mictv telugu

కన్నెర్ర చేస్తే చాలు.. యాత్రలు ఆగిపోతాయి

September 25, 2022

కన్నెర్ర చేస్తే యాత్రలు ఆగిపోతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖ పట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తున్నామని, విశాఖ పరిపాలనా రాజధాని అయితే నష్టమేంటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రూ.10వేల కోట్లు ఖర్చు పెడితే ముంబయిని తలదన్నే నగరంగా విశాఖను మార్చవచ్చన్నారు. తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని తెలిపారు. 29 గ్రామాలకోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదని బొత్స పేర్కొన్నాడు.

‘‘రియల్‌ ఎస్టేట్‌లో ఉన్న భూముల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలకు ముడిపెట్టడం అనేది చాలా అన్యాయం. ఒక ప్రాంతం.. కొందరు వ్యక్తుల కోసం ఆలోచించకూడదు. యాత్రలను అడ్డుకోవడం ఎంతసేపు.. ఐదు నిమిషాల పని. గట్టిగా కన్నెర్ర చేస్తే చాలు యాత్రలు ఆగిపోతాయి.. కానీ ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు, వాళ్లకు ఏమీ చేతకాదు అనుకుంటే చాలా పొరపాటు. ఇక్కడి ప్రజలు చేతులు ముడుచుకు కూర్చుంటే చాలా నష్టపోతారు. కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు అభివృద్ధి జరగాలి. మూడు రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీలు చేయాలి’’ అని బొత్స వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతమవకూడదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని బొత్స అన్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని తెలిపారు.