పేద పిల్లలకు స్టార్‌హోటల్‌లో విందు ఇచ్చిన కాంగ్రెస్ మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

పేద పిల్లలకు స్టార్‌హోటల్‌లో విందు ఇచ్చిన కాంగ్రెస్ మంత్రి

October 28, 2019

పండగలు వచ్చాయంటే.. ఫ్యామిలీతోనో.. ఫ్రెండ్స్‌తోనో అంతా సంబరాలు చేసుకుంటారు. అంతా కలిసి విందు భోజనాలు చేస్తారు. ఇంకొందరైతే పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేసి ఫ్రెండ్స్‌ను పిలిచి పార్టీలు ఇస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన మంత్రి జీతూ పట్వారీ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్దం. దీపావళి వచ్చిందంటే చాలు ఆయన ఫ్రెండ్స్, బంధువులు అంతా పేద పిల్లలే. వారితోనే ఆయన పార్టీ చేసుకొని సంబరాలు జరుపుకుంటారు. తాజాగా ఆయన దీపావళి రోజు పేద పిల్లలకు ఇచ్చిన విందు చూసి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. 

జీతూ పట్వారీ ప్రతి ఏటా దీపావళి పర్వదినం రోజు పేద, అనాథ పిల్లలకు విందు ఇస్తుంటారు. అది కూడా ఏదో తూతూ మంత్రంగా చేయరు. పెద్ద ఫైవ్ స్టార్‌హోటల్ బుక్ చేసి అందులో వారికి విందు ఇస్తుంటారు. తాజాగా ఆదివారం కూడా ఆయన తన సంప్రదాయాన్ని కొనసాగించారు. 

ఇండోర్‌లోని రెడిసన్ హోటల్‌లో చిన్నారులకు విందు ఇచ్చారు. ఆయనే వారికి స్వయంగా వడ్డిస్తూ.. ఫుడ్ ఎలా ఉందంటూ వారిని ఆరా తీస్తూ కలిసి భోజనం చేశారు. తర్వాత వచ్చిన వారికి బహుమతులను కూడా అందజేశారు. మంత్రి జీతూ పట్వారీ చేసిన పనికి నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. డబ్బు ఉన్నవారు ఇలా లేనివారికి పండగ రోజుల్లో సాయం చేస్తే వారికి ఆనందాన్ని పంచడంతో పాటు పేదవారికి అండగా ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.