Minister Dinesh resigned from the post of minister in UP
mictv telugu

యూపీలో యోగీకి అసమ్మతి సెగ.. ఢిల్లీకి చేరిన పంచాయితీ

July 20, 2022

సంపూర్ణ మెజారిటీతో రెండో సారి అధికారంలోకి వచ్చి రికార్డు సాధించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు అసమ్మతి సెగ తగులుతోంది. ఆయన కేబినెట్‌లోని ఓ దళిత మంత్రి రాజీనామా చేయగా, మరో మంత్రి ఏకంగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. సాధారణంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసమ్మతి ఉన్నా, అవి బహిరంగం కావు. కానీ, యూపీలో అందుకు భిన్నంగా జరగడం, పైగా ఏరాష్ట్రంలోనూ లేని విధంగా బీజేపీ భవిష్య ప్రధాని రేసులో ఉన్న యోగీ ఇలాకా కావడంతో ఈ విషయం సంచలనం రేపుతోంది. పూర్తి వివరాల్లోకెళితే.. యోగీ కేబినెట్‌లో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న దళిత వ్యక్తి దినేశ్ తన పదవికి రాజీనామా చేశారు. తన పట్ల నిర్లక్ష్యంతో, ఏ ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని, అధికారిక సమావేశాలకు కూడా పిలవడం లేదని ఆయన ఆరోపించారు. గత వంద రోజులుగా తనకు ఏ పనీ లేదని, ఇలాంటి పదవిలో ఉండి దళిత సమాజానికి ఏం ఉపయోగపడతానని రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు దినేశ్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, ప్రజా పనుల శాఖ మంత్రి జితిన్ ప్రసాద యోగీపై ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సస్పెండ్ చేసింది. అందులో జితిన్ ప్రసాద పీఏ కూడా ఉన్నారు. దీంతో యోగీ జితిన్ ప్రసాదను పిలిచి మందలించారని, దాంతో జితిన్ మనస్థాపానికి గురై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ వరుస ఘటనలు యూపీ బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి.