Minister Errabelli Dayakar Rao distributed Asara cards to new pensioners in Thorrur mandal.
mictv telugu

అర కోటి మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం.. మంత్రి ఎర్రబెల్లి

September 7, 2022

రాష్ట్రంలో దాదాపు అరకోటి మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలో కొత్త పెన్షన్‌దారులకు ఆసరా కార్డులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. పెన్షన్ల వయో పరిమితిని 57 ఏండ్ల కు తగ్గించామన్నారు.

దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో 500 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పథకం ద్వారా 2016 రూపాయల పెన్షన్ అందిస్తున్నారని అన్నారు. దేశంలో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మాత్రం బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులకు, తాజాగా డయాలసిస్‌ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. తాజాగా డయాలిసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్న మహానుభావుడు కేసీఆర్ అని అన్నారు. మనమంతా సీఎం కేసీఆర్‌ కు రుణపడి ఉండాలని ఎర్రబెల్లి దయాకర్‌ అన్నారు.