సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వారిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. తన సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదని, సీఎం కేసీఆర్పై ప్రజలకు నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు 90 సీట్లు వచ్చే అవకాశముందని మంత్రి ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న క్రమంలో.. మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
ఇక పండుగ నాడు మీడియాతో మట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దేశానికి కొత్త క్రాంతి ఇచ్చే పార్టీ బి.ఆర్.ఎస్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. టి.ఆర్.ఎస్ తో దక్షిణాయనం పూర్తి…బి.ఆర్.ఎస్ తో ఉత్తరాయణం మొదలు అంటూ పేర్కొన్న ఆయన సంక్రాంతితో రాష్ట్రం నుంచి దేశం వైపు గమనం మొదలైందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 18న ఉత్తరాయణం చేసేందుకు ఖమ్మం నుంచి బి.ఆర్.ఎస్ తొలి అడుగు వేస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజలు గర్వించే నూతన గమనానికి ఖమ్మం గుమ్మం నుంచి నాంది మొదలవుతుందని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతు పండగ సంక్రాంతి నుంచి రైతు రాజ్యం లక్ష్యంగా భారత రైతు సంక్షేమం కోసం బి.ఆర్.ఎస్ ప్రస్థానం మొదలవుతుందన్నారు.