Minister Errabelli dayakar rao’s brother Pradeep Rao to quit TRS
mictv telugu

టీఆర్‌ఎస్‌కు షాక్.. మంత్రి ఎర్రబెల్లి సోదరుడు రాజీనామా

August 7, 2022

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం నాడు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ.. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలకు కనీసం సహాయం చేయలేకపోతున్నానని చెప్పారు. 9 సంవత్సరాలు టీఆర్ఎస్‌‌లో క్రమశిక్షణతో ఉండి నిస్వార్ధంగా పనిచేశానని, పదవులు ఇయ్యకున్నా పార్టీకి సేవ చేస్తూనే ఉన్నానని ఆయన గుర్తుచేశారు. కనీస గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండి ఏం లాభమని, సంస్కారం లేని నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదని, వరంగల్ తూర్పు ప్రజలతో కలిసి ముందుకు నడుస్తానని ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు.

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ అనుచరుల నుండి తమకు బెదిరింపులు వస్తున్నాయని కూడా ఆయన చెప్పారు. తాను తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కూడా తాను బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ బలోపేతం కోసం పనిచేసినట్టుగా ఆయన చెప్పారు. తన సహకారం లేకుండానే నరేందర్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టుగా చెబుతున్నారన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నరేందర్ రావు తన మద్దతు లేకుండా విజయం సాధించాలని ప్రదీప్ రావు సవాల్ విసిరారు. ఈ నెల 10వ తేదీ లోపుగా తన సఃవాల్ ను స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు ఏమైనా జరిగితే దానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ రావుదే బాధ్యతని ఆయన చెప్పారు.